కావ్యములు ఆంధ్ర పురాణము విజయ పర్వము

ఆంధ్ర పురాణము
మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి

అధికశ్రియ మచ్యుతేంద్ర సూనుం
రఘునాథం రఘునాథ మేవ సాక్షాత్‌
హృదయే కలయంతి యే మహాంతః
పరమానందభరా త్త ఏవ ధన్యాః.
“రామభద్రాంబ”

నాయకరాజ పర్వము
క.శ్రీమధురనైజ మంగళ
నామాదృత తనయ! సత్యనారాయణమూ
ర్తీ! మన్నయనామృతవ
ర్తీ! మత్కవితా ఝరీ సరిత్పతి! సుకృతీ!
1
ఆ.వె.విజయనగర రాజ్య విభవమ్ము పూచిన
పూలలోన రెండు పూలు తునిమి
కొప్పునందుఁ దుఱుముకొనుచు సింహావలో
కనము చేసికొనియెఁ దెనుఁగుఁబడఁతి.
2
శా.ఇంపు ల్మీఱి శతాబ్ది కొక్క కళగా నేపారి సర్వప్రభా
సంపూర్ణంబగు పర్వకాలమునఁ దంజావూరు రాజ్వాబ్ధి తే
లింపుల్వోయెను; నాంధ్రనాయక నృపాళిం దొంటివాఁడై యశ
స్సంపద్ధన్యత నవ్వు ‘చెవ్వపతి’ రక్షాచంద్రికా సాంద్రతన్‌.
3
గీ.విజయపుర రాజ్యమున లెస్స విరిసి పండి
యాంధ్రవైభవ మేకనాళావలంబి
ఫలయుగం బటు మధురఁ జూపులఁ గలంచి
తీపుల పసందు నించెఁ దంజాపురాన.
4
గీ.చోళరాజ్య రమా వీథి సొంపిలంగ
నాంధ్ర సాహిత్యమునకు బ్రహ్మరథమెత్తి
రా మహాత్ములు తెల్గునాయకులు నాఁడు;
వారు లేని తంజాపురి యూరు కాదు.
5
వ.కృష్ణదేవరాయల వెనుక విజయనగర ప్రభుత్వలక్ష్మికి ఱొమ్ము నొడ్డినవాఁ డచ్యుతదేవరాయలు; ఆ రాయలకు వరదాంబిక బహిశ్చరప్రాణమైన దేవేరి. అవ్వరదాంబిక సహజాత మూర్తమాంబ, మూర్తమాంబను బెండ్లియాడిన చెవ్వప్ప దండనాయకోద్యోగంబున నున్నవాఁడు; తన చెల్లెలి పెనిమిటి యటులుంట వరదాంబికకుఁ జిన్నతనము.6
గీ.తా నొక మహాంధ్రమేదినీజాని మౌళి
భూషణమ్ముగ సొంపారు పూలకొమ్మ;
యొక్క యుద్యోగ పరతంత్రు నువిదయైన
తన సహోదరి మూర్తమ్మ కనుల చెమ్మ.
7
మ.తన తోఁబుట్టువు పెంపుఁ గోరిన దయార్ద్రస్వాంత యారాణి చె
ప్పినయంతై యటఁ జోళదేశమున నిల్పెన్‌ ఱేనిగాఁ జెవ్వనా
యని నయ్యచ్యుతదేవ భూవరుఁడు శ్రేయఃకాంక్షమై దేశ పా
లన దేవీహిత లాలనం బుభయతోలాబార్థపాశంబుగన్‌.
8
శా.రంజిల్లెన్‌ మును జెవ్యభూపతి ప్రియారంభ ప్రభావంబునన్‌
దంజావూరున నాయకప్రభుత; యాంధ్రశ్రీ పదాబ్జోచ్చల
న్మంజీరద్వయ మంజునాద మకరందస్రోతసీ సర్వతో
గుంజ ద్ద్రావిడభృంగముల్‌ కనె హొరంగుల్‌ చోళభూరంగముల్‌.
9
మ.తెలుఁగుం గబ్బపు జగ్గునిగ్గు లవి దీప్తింబాసె; శ్రీకృష్ణరా
యలవెంటన్‌ మఱియుంట యేల యని చింతాధూత వాగ్దేవియున్‌
వలసల్వోయెను దంజపట్టణపు సౌభాగ్యంబు రెట్టించి రా
యలనేలం గికురించి నాయక నృపాలాలోల భావస్థితిన్‌.
10
గీ.జింజి మధురాధిపతులతోఁ జేయికలిపి
తంజపురమును శక్తిమంతముగ నిలిపి
చెవ్వపతి తృతీయాశ్రమ శ్రీ వహించి
చెందె బృహదీశ్వరాద్వైత సిద్ధిఫలము.
11
వ.చెవ్వప్పనాయకుండు నిజస్వామిభక్తికిఁ దారకాణగా నిడుకొన్న యచ్యుతనామమ్ముతో నాతనిసుతుండు విరాజిల్లి తండ్రి తరువాతం దండ్రియంతవాఁడై పేరుమోసె; నచ్వుతనాయకుని ధీసచివుండు గోవిందదీక్షితుండు సర్వతంత్ర స్వతంత్రుండగు విశారదుండు; వాని కతన సచివపీఠంబు సమర్థాధిష్ఠితం బయ్యె.12
మ.అతిరాత్రంబును సాగ్నిచిత్యమును మున్నౌ జన్నముల్‌ సేఁత సం
తతమున్‌ మున్కలువెట్టి తా నపరవిద్యారణ్యుఁడై లౌకిక
స్థితితోడం జతసేయుదైవబలముం జేనందు గోవింద దీ
క్షితుఁ డాశీస్సులు వోసి యచ్యుతునిఁ గాచెన్‌ మంత్రియై సర్వమై.
13
గీ.మహిపతియు మంత్రియును ద్రినామమ్ములందు
మొదలు తుదినామములుతాల్చి పొదలుచుందు;
రాఢ్యులిద్దఱు నాహవ హవములందుఁ;
జతురులిరువురు శస్త్ర శాస్త్రమ్ములందు.
14
గీ.అతఁడు గోవిందదీక్షితుం డాచరించు
యాగములకేఁగి యాణిముత్యాల గొడుగు
వేయు యువరాజు రఘునాథనాయకుండు
తండ్రియానతి భక్తి నౌదల ధరించి.
15
వ.ఏలినాతని యోగక్షేమమ్ము లరయుచుండు గోవిందదీక్షితుండు బాలభాస్కరుంబోని రఘునాథుని యనుక్షణవర్ధమాన తేజోవిశేషమున కానందపడుచుండు; నటులుండం గొన్నాళ్ళకు-16
లక్ష్మీవిలాసభవనము : ఏకాంత సమాలోచనము
గీ.తంజపురికోట సిరిమెడఁ దాళిబొట్టు
చెలువుమీఱినయట్టి ‘లక్ష్మీవిలాస
భనన’ గర్భమునన్‌ మూఁడు పసిఁడిగద్దె
లేకతపుస్వాగతముఁ జెప్పె నెవరికొఱకు!
17
మ.సమభావప్రతిపత్తిఁ బ్రాజ్యతర తంజావూరు సామ్రాజ్య చ
క్రము కేలంగొనిత్రిప్పు నచ్యుతమహీకాంతుండు నొండొక్క పీ
ఠముఁ గైసేసె; నఖండ నీతిహితపాఠ శ్రద్దధానుండు స
త్తముఁడౌ ధీసచివుం డొకం డతనిచెంతన్‌ గద్దె నిండారఁగన్‌.
18
చ.అనితరభోజ్యరాజ్యవిభవాంతర తంత్రసమస్యలందు - మం
తనములయందు - శాత్రవమనస్సుల జాడలపట్టునందుఁ - బం
డిన కనుబొమ్మలం దురవడించినతేజముఁ జిందు నయ్యమా
త్యుని దరిదాపుగద్దె నెదియోయొక మన్మథమూర్తి తోఁచెడిన్‌.
19
గీ.అచ్యుతుఁడుగన్న దివ్యరూపాంతరమ్ము -
పరమకరుణార్ద్ర గోవిందగురుకటాక్ష
ఫలము - తెలుఁగుం బొలంతుక వలపుఁబొలము
నతఁడు రఘునాథనాయకుం డగుట నిజము.
20
మ.నవసృష్టిం బచరించి తెల్గుధర విన్నాణంబు నాణెంబు గౌ
రవము న్నిల్పఁగఁ గ్రొత్తయెత్తుగడ మేరల్‌ముట్ట నేకాంతవై
భవ లక్ష్మీభవనంబునం దటులు చెల్వంబారఁ గూర్చుండి ర
మ్మువురున్‌ మూర్తులు నేవొ మంతనపునేర్పుల్‌ తీర్పు లూగాడఁగన్‌.
21
గీ.అంతట దినాంతపక్వ భాస్వంతుఁబోని
యచ్యుతేంద్రునిదెస నద్వయత్వమెనసి
పలికె గోవిందయజ్వ కన్గొలఁకు లొరయ
ననుఁగుశిష్యుని వదనతేజోఽగ్ని విరియ.
22
మ.“బరువై యొక్కఁడుగాక మూఁడు విషమప్రత్యర్థిఘట్టంబు లూ
పిరిదీయన్‌ గడువీక రాచఱికపుం బింకమ్ము జంకించు ని
త్తఱి- వెన్‌దీయక యొక్కవిన్నపముసేఁతన్‌ నాదు లోఁగోర్కి దే
వరసాన్నిధ్యమునందుఁ బేర్కొనుట దర్పంబయ్యుఁ దీర్పేయగున్.
23
సీ.ఒకటి - గరాసుఁ జోళకుని రూపఱఁద్రోలి । పారశీకనృపాళి భంగపాటు
రెండు - నేపాళ ప్రచండశత్రులఁ జెండి । జాఫ్నానృపు నధీశ్వరునిఁజేఁత
రంగరాయలను నౌరసమైన కర్ణాట । భూరాజ్యమందు నిల్పుదల - మూఁడు
నార్తరక్షణము లియ్యవియెల్ల మనరఘు । నాథు నేల్బడికిఁ బునాదిగెలుపు
 
గీ.లగుతఁ! బగఱేండ్లబుజముల పొగరడంచి । విజయలక్ష్మి వరించి యక్కజముఁగొలుపు
తనయు నభిషిక్తశిరము మూర్కొనెడితండ్రి । యగు నదృష్టము దేవర యందుకొనుత!
24
మ.మొగముంగప్పు సితాతపత్రరుచి పొల్పుల్‌మీఱఁ బట్టంపుటే
నుఁగుమీఁదం బురియేఁగి కన్గవకు విందుల్‌సేయుచున్‌ యౌవరా
జ్య గరీయఃపదభద్రుఁడైన రఘునాథాధీశు నాశీర్వదిం
పఁగ నా కంతకుమించి లేదొకఁడు చెప్పన్‌ వాంఛ లోలోపలన్‌.
25
గీ.పయికి - నీ మనరఘునాథుపాటి నరయఁ
బిల్లకాలువగాఁ గానిపించుఁగాని
పాలసంద్రము బంధింపఁజాలు నితని
యెడ గురుత్వముఁగొని వసిష్ఠుఁడను గాను.
26
వ.అని గోవిందదీక్షితుఁడు పలుకుటయు-27
చ.వయసు మనస్సు మెండుకొని పండిన యచ్యుతభూమిజాని వి
స్మయ మిసుమంతలేని వివశత్వమునన్‌ సచివోత్తమోక్త వా
ఙ్మయమధు వాని - దానిఁ దన మానసవాంఛ కుపశ్రుతింబలెన్‌
గయికొని పుక్కిలింతలయి కార్కొనువేడుక నిట్లు పేర్కొనెన్‌.
28
గీ.“మొక్కలపుశాత్రవులు పన్ను ముండ్లకంప
నలమి నలుఁగుడువడిన రాజ్యాంగపటము
సరది సవరింపఁగా దొడ్డచదురు వలదె!
యదిర! యీబిడ్డ కంతటిచదురుగలదె!
29
క.ఏమో! లేదని తలఁచుట
సామీ! గోవిందసూరిసత్తము శిక్షా
శ్రీమాన్యత శంకించుట
యై మా గౌరవము పలుచనై పోవచ్చున్‌.
30
క.కాదనుట కాదు; నాందీ
వాదులు మీరుండి రాజ్వభరమును దమితో
నాదుకొనఁగ రఘునాథునిఁ
జేఁదుకొనెద మింక భక్తి శ్రీరంగవిభున్.
31
క.అనిపలికి పండుఁగన్నులఁ
జినికెడి యానందబాష్ప శీకరముల దీ
వనలిడి రఘునాథునితలఁ
గనుకని గోవిందసాక్షికమ్ముగఁ దడిపెన్‌.
32
మ.తుదికాలాన విపత్పయోదములు దొంతుల్‌దొంతులై దక్షిణాం
ధ్ర దశాకాశము మూయ నచ్యుతుఁడు వార్ధక్యమ్మునంజిక్కి యా
పద లడ్డన్‌ దనపుత్రు నేల్బడి వెలార్పన్‌ గద్దెపై నిల్ప, న
య్యదనన్‌ శ్రీరఘునాథుఁ డందుకొనె గ్రీష్మాదిత్య రోచిశ్ఛటల్.
33
వ.అచ్యుతనాయకుండు కుమార రఘునాథునకు రాజ్యం బప్పగించి శ్రీరంగపురమున నుండి రంగనాథ చరణసరోజమ్ములు ధ్యానించుకొనుచుండె; రఘునాథనాయకుం డిటఁ గర్తవ్యకార్యత్రయ నిర్వహణమ్మున నిష్ఠితుండై ప్రధానుఁ డగు గోవిందయజ్వపై నేల్బడి బరువు నుంచి యమ్మహనీయుని దీవనలం గాంచి యొకతరుణంబున-34
రఘునాథుని దేవికోట ముట్టడి
మ.బలియుండౌ రఘునాథనేత సమరప్రస్థానమై పోర్చుగీ
సుల తోడ్పాటునఁ గన్నుగానని గరాసుం జోళకుం బట్టి పా
యలుసేయం దలపెట్టి వాహినులు తోడై రాఁగఁ గావేరి యొ
డ్డులియన్‌సాగి సముద్రసంగమమునం దుడ్డాడి యొక్కింతలోన్‌.
35
గీ.కడలి పొడవున వంతెనగా నమర్చి
పడవలను జేర్చి పౌఁజుల నడపుకొనుచుఁ
దాను రఘునాథుఁడుగ సముద్రమ్ము దాఁటి
దీమసమున సమీపించె దేవికోట.
36
మ.తలఁపంగా నెడమీక కట్టలుకమైఁ దంజాపురీనేత పౌఁ
జులతో వారిధి దాఁటివచ్చుటయు నచ్చో శాత్రవుల్‌ కోట గో
డలపై నెక్కి ప్రచండభంగిఁ బెనుగుండ్లన్‌ మీఁద రువ్వన్‌ నిరా
కులమై నాయకసేన ముందునకు దూఁకున్‌ బంధురోత్సాహితన్.
37
ఉ.దుండగ మెంచు చోళకునితో నెదురొడ్డఁగ నుత్సహించి వే
దండముతోడ సాగరము దాఁటిన శ్రీరఘునాథ నాయకుం
డండగ నుండఁ దంజనగరాంధ్ర చమూతతి కడ్డమాఁక యెం
దుండును! పోర్చుగీసు బలియుల్‌ పెనుగుండ్లను మీఁద రువ్వఁగన్‌.
38
చ.ఒకరి బుజమ్ముపై నొకఁడు నొక్కఁడుగా నిలఁబడ్డ యట్టి భౌ
తికమగు క్రొత్త నిచ్చెనలు దీరిచి శ్రీరఘునాథునాన సై
నికులు పతచ్ఛిలాతతి గణింపక పైకెగఁ బ్రాఁకి కోటలో
నికి దిగి పొగవేసి రవనీపతి నెమ్మది నామతింపఁగన్‌.
39
ఆ.వె.పోర్చుగీసుసేన పొగరుందనపు టగ్గి
సెగలు రగులుకొలుపఁ జేయువాఁడు
చోళకుండు ఝంఝవోలె మీఁదికి దూఁకి
తొలుతఁ దెలుఁగుసేనఁ గలఁతపఱుప.
40
మ.అలుకన్‌ మిన్నులు ముట్టి నెత్తురులుదీయన్‌ బుష్కలాంభోధర
ప్రళయాకారమునన్‌ రఘూత్తముఁడు వీరశ్రేణి భీతిల్ల గ
ర్జిలి దుర్జాతునిఁ జోళకు న్నిలువరించెన్; ముంచె నిస్త్రింశ ధా
రలఁ; జెల్లాచెదరయ్యెఁ దద్బలము నిర్యచ్ఛోణితార్ద్రాంగమై.
41
మ.ఒక యావేశముతో నటుల్‌ తెలుఁగుఱేఁ డుత్సాహియైవ్రాలి చో
ళకు లీలాగతి నిగ్రహించి నిలువెల్లన్‌ వంచి కృష్ణప్ప నా
యకుఁ డన్వానినిఁ గాందిశీకునిగఁ జేయన్‌ బోర్చుగీసుల్‌ కకా
వికలై యార్చిరి దేవికోటఁ బ్రభుతాప్తిన్‌ దర్పణం బిచ్చుచున్‌.
42
ఉ.పాపభయమ్మువీడి ప్రజపైఁబడి రాపిడిసేయు నా జగా
దోపిడిదొంగ చోళకునితో బహుకాలముఁ దొట్టి నచ్చు సం
తాపముఁ బాపినట్టి రఘునాథ నృపాలు నమోఘ వీరతా
వ్యాపృతికిన్‌ జయారవముఁ బల్కిరి వేడుకమైఁ బ్రజావళుల్‌.
43
గీ.జలనిధిని గట్టి పోర్చుగీసులను నెట్టి
చోళకునిఁ జెఱసాల యుచ్చులను బెట్టి
తెనుఁగు రఘుపతి దేవికోటను నదల్చి
చిటికలో నట్లు తొలిగెల్పుసిడము నెత్తె.
44
వ.కానీ, రఘునాథ భూనాథుం డా ప్రథమ విజయమ్మునం దనివోక జాఫ్నా నెలవుచేసికొని పోఁతరించిన పోర్చుగీసుల నెదిర్చి శరణార్థియగు నేపాళభూపాలు నచ్చోటఁ బునఃప్రతిష్ఠితుంజేఁత రెండవపనిగాఁ బయనించి సేనలు నడపించె.45
ఆ.వె.అహిత యూధ మత్త మహిత భటావళి
విసరు ఘన శతఘ్ని విసరమునకుఁ
దాళి తంజనగరపాలుండు రఘునాథుఁ
డాంధ్ర సైనికుల స్వయమ్ము నడపె.
46
గీ.డచ్చిసేనాను లలవోక నిచ్చుచున్న
ధీర శిక్షణముల సానదేఱినట్టి
రాణువలు పోర్చుగీసు వీరప్రపంచ
మడ్డగించెను రఘునాథునాజ్ఞ నొడ్డి.
47
శా.తాలోత్తాల తరంగ దుస్తర సముద్రంబట్లు లంఘించి ని
ర్వేలాభీలతఁ దంజపట్టణ మహోర్వీనేత దుశ్శత్రులం
గూలం ద్రోయుచుఁ, జూచు వీరులకు జంకుల్వుట్ట మట్టాడి నే
పాళాధీశుఁ బునఃప్రతిష్ఠితు నొనర్పంబంచె రాజ్యంబునన్.
48
వ.రఘునాథుండు విభీషణునకుం బోలె నేపాళరాజునకుఁ బట్టంబుఁ గట్టి విజయభేరీరవంబుతోఁ దంజపట్టణంబున కరుదెంచి గోవిందదీక్షితుని మంగళాశాసనంబు లందుకొనియె; నింక రఘునాథుండు సాధింపవలసిన మూఁడవ గెలుపొండు మిగిలియుండె; నయ్యది జగ్గరాయల నోడించి విజయనగర రాజ్యపీఠమ్మున రామరాయల నిలుపుట; రామరాయల పురావృత్తమ్మొండు స్మర్తవ్యమైనయది.49
జగ్గరాయల కుట్ర : చిక్కరాయల కుటుంబమునకుఁ జెఱ
గీ.సకల కర్ణాట సామ్రాజ్య సార్వభౌముఁ
డైన నేమాయె! లేదు సంతానరేఖ
వీరవేంకటపతికి; నిండారు నతని
హృదయమున నింతకంటె నేకొదవ చొరదు.
50
గీ.రాయ లొక ధీరబుద్ధి విరక్తిఁగొనిన
నతనిరాణికి నది యసహ్యమగు బాధ;
యామె గొబ్బూరి జగ్గరా జనెడివాని
కన్నపుత్రిక యగు నెఱగడుసుగత్తె.
51
గీ.ఏలుబడిలోననున్న చూలాలి నొకతె
నంతిపురమునఁ జేర్పించి యామె కన్న
కొడుకుఁ దాఁ గన్నకడుపుగా నొడుపుఁజూచి
పెంచుకొనసాగెఁ బతి మోసగించివైచి.
52
గీ.బ్రతికినన్నాళ్ళు వేంకటపతికి రాణి
కతుకుకొనలేదు హృదయమ్ము; లామె కొన్న
కొడుకుపైఁ గన్నబిడ్డ ప్రేముడి వెలార్పఁ
దరముకాలేదు కర్ణాట ధరణిపతికి.
53
గీ.అదియటుండె; నాతఁడు జీవితావసాన
సమయమున లోనితలఁపెల్ల సచివసంఘ
మాలకింపఁగ వినిచి - మేనల్లుఁడైన
చిక్కరాయలఁ బిలిచి యాశీర్వదించి.
54
గీ.ప్రజలు వినుచుండ “నితఁడె సామ్రాజ్యపీఠి
కర్హు” డని వాని పాణితోయజముఁ బుడికి
కరము మురియు వజ్రంపుటుంగరముఁ దొడిగి
విడిచెఁ గడపటియూర్పుఁ గన్నడపుఱేఁడు.
55
గీ.వీరవేంకటపతివెన్క విజయపురిని
జిక్కరాయలు పట్టాభిషిక్తుఁ డయ్యెఁ;
గూఁతుమేల్గోరి కూడనికుట్రఁ గొనిన
జగ్గరాయల కది మనశ్శల్య మయ్యె.
56
గీ.చెనఁటి తలఁపునఁ దులువలఁజేరఁ బెంచి
మోసగావించి సకళత్ర పుత్ర మిట్టె
చిక్కరాయలఁ జెఱఁబెట్టి యుక్కివుండు
జగ్గరాజు దౌహిత్రు నాస్థాని నిలిపె.
57
గీ.వెలమసరదారు వెలుగోటికొలములోని
వాఁడు యాచమనాయఁ డప్పాడిగాని
పనికి గర్హించి కులగౌరవమ్మునెంచి
కాని ఱేనికిఁ గప్పముఁగట్ట మానె.
58
గీ.రాయల కుటుంబమునకుఁ గారానివాస
బంధ ముడిగింపఁగా దీక్షవట్టి యతఁడు
కైదునకు వచ్చిపోవు చాకలిని బట్టి
చిక్కరాయల కెద్దియో చీటిననిపె.
59
గీ.ఆతఁ డా కమ్మఁగని యుపాయజ్ఞుఁడైన
వెలమజోదు కృతజ్ఞతా విలసనమున
కలరి పదియేండ్ల మూవప్రాయముననున్న
తనయునొక్కని రజకహస్తముల నునిచె.
60
గీ.నలువఁ గనుగప్పు వలఁతి చాకలి యతండు
రామరాయల జీవాత్మ నోమికొనుచుఁ
బ్రాతఁబట్టల తట్టలోపల నిమిడ్చి
నేర్పుమెయిఁ దెచ్చి యాచమనీని కిచ్చె.
61
గీ.ప్రాఁకె మఱునాఁటి కవ్వార్త పట్టణమున
జగ్గరాజున కాశీవిషమ్ము సోఁకె
వెలమజోదు యాచమనీని వెరవునెంచి
చేరి రాతనిదెసఁ దెల్గువీరవరులు.
62
గీ.రాయలఁ గళత్రసుతులతో ఱాతిగుండె
చంప నియమించెఁ గిగ్గాడి జగ్గరాజు;
జరిగిన దురంతతంత్ర దుర్భరత నెఱిఁగి
పుడమి సకలము నుడికె నట్టుడికినటులు.
63
గీ.రాయల కుటుంబమెల్ల నిర్దగ్ధమయ్యుఁ
గడకుఁ దనకడ మిగులు వంగడపుమొలక
రామరాయలు విజయపురమ్ము గద్దె
నిలుప దీక్షించె యాచమనీఁడు కడిమి.
64
గీ.ధర్మపథమున నడచునాతనికి నియతి
యనుగలం బగుఁగాదె! నెయ్యములు నెఱపి
జోదు లయ్యాచమున కండఁజూప నతఁడు
రామరాయలఁ దంజాపురమ్ముఁ జేర్చి.
65
గీ.శ్రీమదచ్యుతవిభుని దర్శించి వినిచి
యప్పగింపఁగఁ దంజాపురాధినేత
జగ్గరాజదుష్టుని నృశంసతకుఁ గనలి
యభయకరమున రామరాయలను నిమిరె.
66
గీ.ముసలిదశరథుఁ డచ్యుతభూమిజాని
జగ్గరాజ సుబాహుపక్షములు గెడప
బాష్పముక్తాభిషేక శుభమ్ము నడపి
తన తనూజాతు రఘునాథు ననిపె ననికి.
67
తోపూరుపోరు : రామరాయల యభిషేకము
వ.నళనామవత్సరంబున నాషాఢ శుక్లపంచమీతిథిని వీరసేనా నివహమ్ము వెంటరా రఘునాథుండు సమరప్రస్థానము సాగించి కావేరీఝరీతీరంబునఁ బయనించి పళవానేరి గ్రామంబుఁ బ్రవేశించి నాఁటిరేయి యచ్చోట నవికలితహృదయుండై పరుండి మఱునాఁడు-68
సీ.పావనోషఃకాల పవనభంగ కదంబ । లాలనంబున నిద్రమేలుకాంచి
నామతీర్థముఁ బురాణశ్రవణంబును । రామతారక జపార్చనము నెఱపి
విష్ణుభాగవతుల విజయాక్షతమ్ములు । తాత్పర్యమలర మూర్ధమునఁ బఱపి
యాదిత్యహృదయపారాయణ మ్మొనరించి । యాఱవగడియలో నారగించి
 
గీ.ప్రతిదిన క్రమకార్యనిర్వహణ సరణి । నాఁడు జరిగించి సమరసన్నద్ధుఁడైన
తంజపురినేత ముఖరక్త తామరసము । శాంత మధుధార వీరవిక్రాంతిఁ గప్పె.
69
సీ.పురుషోత్తమాదు లిర్వురు నిర్వురొక్కొక్క । యేన్గెక్కి యిరుపజ్జ నెచ్చరింప
రామభద్ర కుమారరత్నమ్ము వెనువెన్క । గంధసింధురముపైఁ గదలిరాఁగ
వెలుగోటియాచమవిభుకేలి కరవాల । ముద్యత్తటిద్వల్లు లుత్సహింప
రామభద్ర గజాధిరాజమ్ము ‘గరుడాద్రి’ । యనెడి ‘హౌదా’ పయి నధివసించి
 
గీ.చెలఁగె రఘునాథనృపతి యాశ్లిష్ట సాను । వైన యాషాఢమేఘమ; ట్లతనివెంట
రామరాయలు విజయఫలామృతాభి । పానమతి నుండెఁ జాతకపక్షివోలె.
70
మ.అటు లుత్సాహముతో రఘూత్తముఁడు సైన్యశ్రేణిఁ దోపూరుఁ జే
ర్చుటతో నెల్లెడ జగ్గరాజుమది నార్తుల్‌ నిండఁగాఁ గప్పెఁ జీ
కటి; యా రాతిరి వేచి నల్దెసను జాగర్యారుణ శ్రీద్యుతి
స్ఫుటతం దంజపురీనుఁ డేచి పొడిచెం బోరాటఁ బెన్గూబలన్‌.
71
గీ.బలుతుపాకులు పెనుపిరంగులును మ్రోఁగఁ
గారుపొగ మిన్నురేఁగఁ దోపూరుపోరు
శ్రావణాంభోద భీద గర్జానినాద
బంధురము వానకారు నేర్పడఁగఁ బిలిచె.
72
శా.తానై వ్యూహముఁబన్ను జోదు రఘునాథస్వామి యాత్మీయ సై
న్యానీకంబున నాశ్వికప్రతతి మెండౌ మండలాకార రే
ఖా నీరంధ్రత నిల్పి, కాల్బలము ప్రాకారమ్ముఁ దీర్పించి, యు
చ్ఛూనాగ్నిస్ఫుటయంత్రసంహతుల నచ్చోఁదీర్చె మున్ముంగలన్‌.
73
ఆ.వె.శితకృపాణపాణి చెలరేఁగి రఘునాథుఁ
డాది పాండ్యరాజు నడ్డగించె;
నుభయసైనికులకు నుద్భట తుములసం
గ్రామమయ్యె జగ్గరాజునెదుట.
74
మ.తమలోనం దమకున్న తొంటిపగ లత్యాకారముం దాల్పఁ బాం
డ్యమహీపాలుఁడు చోళభూవరుఁడు తీండ్రంబార సంగ్రామ రం
గమునం గత్తులుదూసి పెద్దగఁ బెనంగన్, గ్రుంగి పాండ్యేశుఁ డో
టమిమై నొట్టిడుకొన్నవాఁ డరుగుజాడం బాఱెఁ బెన్‌భీరువై.
75
ఉ.అంతటి శౌర్యధుర్యుని సహాయతఁ బాసిన వంతమ్రింగి దు
ర్దాంతుఁడు జగ్గరా జొడుపుదప్పిన సర్పమువోలె రోఁజి - కా
లాంతకుఁడైన తంజనగరాధిపు నాజికిఁబిల్వ నుజ్జ్వలత్‌
కుంతములం బరస్పర మకుంఠిత సంగరమయ్యె నయ్యెడన్‌.
76
చ.పెనఁగొను శూరతన్‌ వెలమవీరుఁడు యాచమనీఁడు పట్టఁజా
లని పెనుకిన్క గొబ్బురికులంబును వెంపరలాడనెంచి ముం
దున కరుదెంచి బల్లెమును దూయుచు “ధూర్తుఁడ! నీకుఁ దక్కనీ
యను రఘునాథుచేత మడియంగల భాగ్యము నార్చి చచ్చినన్‌.
77
మ.అని హుంకారమొనర్చి యాచమవిభుం డత్యుగ్రతం బేర్చి జ
గ్గని వక్షమ్మును శాతకుంతమునఁ గ్రుక్కన్‌ - దెబ్బతో వాఁడు ర
క్త నదీక్షాళితవేషుఁడై దురితగాథాశేషుఁడై సర్వస
జ్జన సంత్రాసము తీరఁగా నొరఁగె భ్రశ్యత్పాణ సంతానుఁడై.
78
గీ.యాచముని శాతకుంత ఘాతాప్తి కతన
జగ్గరాయల తనువు భూస్థలికి నొగ్గె;
విజయ కమలా నిజాపాంగ విభ్రమముల
నంబరమ్మంటె రామరాయల ముదమ్ము.
79
ఉ.“గొబ్బురి జగ్గరాజు లొకకోటియు డెబ్బదికోట్ల మాక రా
జబ్బలు లక్షమీఁదఁ బదియార్గురు రావిళవెంకలైన మా
నిబ్బరగండ యాచధరణీపతి ముందట నిల్వ శక్తులే!
గబ్బులు లేక బెబ్బులి ముఖాముఖి మేఁకలు నిల్య నేర్చునే!”
80
క.అని పలికి విజయభేరీ
నినదం బినుమడిగఁ దంజనేతృ భుజాలిం
గన రంజితు యాచమవిభుఁ
గొనియాడిరి వీరనాయకులు కవులగుచున్‌.
81
గీ.ప్రథమ మల్ల నిబర్హణ వ్యథకు లోఁగి
వెఱచి పాఱిరి పరపక్షవీరులెల్ల;
మధుర వీరప్పనాయఁ డుమ్మలికఁ బాఱఁ
దఱిమి కొందఱు జోదు లాతనినిఁ బట్టి.
82
ఆ.వె.ప్రభులయెదుట నిలుప - రఘునాథ భూజాని
దీన రక్షణైక దీక్ష బూని
కడుపులోని కరుణ నొడికారమున దాఁచి
పరిహసించె మధురపతినిఁ జూచి.
83
క.“వీరెవ్వరయ్య! మధుర మ
హారాజులే! యిట్లు కృపణులయి పట్టువడన్‌
వీరికి వలసెనె!” యని, సు
స్మేరముఖుఁడు వానిలోన జీవము నిలిపెన్‌.
84
వ.అభిమానియగు ముత్తువీరప్పనాయం డా పలుకు విని యవమానితుండై తల వంచుకొని సమరాంగణరసికుండగు రఘునాథుని కరుణాధురీణతకు మురియుచుం బోయె; ననంతరము-85
మ.అల తోపూరు రణాంగణస్థలము దీవ్యన్మంగళాస్థాన దీ
ప్తుల నిండారఁగ జగ్గరాడ్రుధిర పాథోధి ప్రవాహోద్ధృతం
బులు నీరంబులు దెచ్చి యాచవిభుఁ డాప్తుం డీయఁగా, రామరా
యల మౌళిన్‌ రఘునాథభూవిభుఁడు వోయన్‌ మీఱె నాశీరుతుల్‌.
86
గీ.అభిషవోత్సవ మిట్లు రణాజిరమున
జరిపి - యాచమనీని బాసటగ ననిపి-
రామరాయల రఘునాథ భూమినేత
నిలిపెఁ బెనుగొండ సింగపుంబొలుపు గద్దె.
87
వ.మఱియు విజయవిలాస కావ్యకర్త చేమకూర వేంకటకవి కాశ్రయస్థానంబైన రఘునాథ మహీనాథుండు సాహిత్యచక్రవర్తి. అతని కుమారుండు విజయరాఘవనాయకుండు-88
విజయరాఘవుని యన్నదాన వ్రతము
సీ.వాగ్గేయ సుకవితా స్వర్ణంబుఁ బండించు । క్షేత్రయ్యగానమాక్షికముఁ గ్రోలి
బిరుదైన గండపెండెరముతో శారదా । ధ్వజముతో రామసౌధమున మెఱసి
యక్షగాన ప్రబంధాదుల రచనతో । సహృదయ హృదయ రంజన మొనర్చి
కనకాభిషేకమ్ముఁ గొనిన రంగాజమ్మ । శృంగార కవిత నాశీర్వదించి
 
గీ.రాజగోపాల చరణ సరోజరజము । నిలువున నలందుకొని భక్తికలితమైన
రక్తిమై ‘నిందిరామందిరమ్ము’ నేలె । రాఘవుండు కళావతీ రమణిసుతుఁడు.
89
గీ.తంజపురరాజ్య మంజు ముక్తాసితాత
పత్ర సుచ్ఛాయ కేతెంచి ప్రజల మదులు
తనుపువడఁ దండ్రి యొరవడిఁ గొనుచు సాగి
విజయరాఘవుఁ డవని దీపింప నేలె.
90
గీ.తరణి యుదయించి తొలిజాము దాఁటకుండఁ
బూటఁ బండ్రెండువేల విప్రులను బిలిచి
పరమతృప్తిగ వారు సాపడిన వెన్కఁ
గాని తినకున్కి విజయరాఘవుని వ్రతము.
91
చ.ఘుమఘుమలాడు గోఘృతముకుండలు శారద చంద్ర చంద్రికా
విమల దధిప్రపూర్ణములు విస్తృతభాండము లుండుచోట నే
త్ర మధుర మౌనటుల్‌ గన నుదాత్తముగాఁ దినినట్టితన్పు ల
చ్చముగ లభించుఁ దంజపుర సత్రమునన్‌ జయరాఘవాదృతిన్‌.
92
గీ.తంజపురనాయకు సదాన్నదాన నిరతి
కంజలులు వట్టి భూజను లభినుతింతు;
రమ్మహీపతి వ్రతపరీక్షార్థ మనఁగ
మెలమెలఁగ విఘ్న జలదమ్ము తొలకరించె.
93
చ.ఎడనెడఁ గొన్ని రవ్వజడు లేర్పడి నాఁటికి నాఁటి కుబ్బుచున్‌
గడవలఁ గ్రుమ్మరించినటుగాఁ బెనువానలు మిన్ను కన్నముల్‌
వడినటు లౌచు రాష్ట్రము జలప్రళయంబునఁ దేలె సర్వమున్‌
జెడియె షడీతిబాధలవిజృంభణ మేకముఖంబుఁ బట్టఁగన్‌.
94
ఉ.ఒండును రెండు మూఁడు పదియున్‌ బదునాలుగు నాళ్లుకాదు బ్ర
హ్మాండము తేలిపోవ నొక మాసము పైఁబడి కుండపోఁతగా
నుండుటఁ బ్రొయ్యిమీఁది వటులుండఁ గ్రమంబుగఁ బ్రొయ్యిక్రిందికిన్‌
నిండుకొనెం దెనుంగు ధరణిన్‌ బెనువానల బిట్టుతాఁకిడిన్‌.
95
క.ఒక యింటిమీఁది కాకం
బొకయింటికి నెగయఁ దెఱపి యొదవని యతివృ
ష్టికి లోకము వెఱ నిటు నటు
పొకాలఁగా జడిసి తడిసి మోపగుచుండెన్‌.
96
ఆ.వె.కొంప మునుఁగుఁగాక! కోట మున్గునుగాక!
వ్రతముఁ గొన్న విజయరాఘవుండు
పదియు రెండువేల ప్రజ వచ్చి “యమృతమ”
స్తనకయున్నపూఁట తినఁడు తాను.
97
రాష్ట్రములో నతివృష్టి
వ.విజయరాఘవుని నిరంతరాన్నదానదీక్షాధురంధరత కించుకంతయుఁ గొఱంత రాకుండ నయ్యఖండ వర్షాసమయ మేనాఁటి కానాఁడు కడచనుచుండియు, నెన్నినాళ్ళకుం దెఱపి యీకుండుటం గని రసవతీ పౌరోగవుండు వంటచెఱకు చితుకుకూడ లేమిం దత్తరించి యార్ద్రకాష్ఠంబుల వంటయగునెత్తు లేక మహారాజున కొక్క మనవిసేయం దలంచి వడంకు తడిదోసిట విజయరాఘవుని దర్శించె నయ్యెడ.98
మ.అసమోత్కంఠమునం గవీంద్ర కృత కావ్యశ్రావ్య సాహిత్య వా
గ్రస వర్షంబునఁ దోఁగు తంజ ధరణీకాంతుండు విద్వత్కదం
బ సమాలంబుఁడు శాంతుఁడై వినియె నమ్రస్వాంతుఁడౌచున్‌ మహా
నస ముఖ్య వ్యవహర్త విన్నపము సాంతం బిట్లు విన్పింపగన్.
99
క.కన్నది విన్నది కా దిది
యెన్నఁడు నీ కారుమబ్బు లివియేమి ప్రభూ!
యెన్నఁటికిఁ దెఱపివడి మా
కన్నుగడల వెలుఁగురేక గన నోఁచితిమో!
100
క.మాపట రేపట ననుకొను
చోపికమెయి లోక మెంతయూఱటఁ గొనినన్‌
బాపపు వానల వెల్లువఁ
జేపడె నోదేవ! గుండె చెఱువై పోవన్.
101
గీ.ఏది యెటులైన దేవరయిడినయాన
నన్నసంతర్పణము లవిచ్ఛిన్నభంగి
సాఁగుచున్నవి; కొఱఁత కాసంత లేదు;
కాని యొకవిన్నపము సమ్ముఖమున వినుతు.
102
ఉ.కొల్లలు కొల్లలై నిలువగూరిచియుంచిన యెండుకట్టియల్‌
పుల్లయు లేక చెల్లుబడివోయెను నేఁటికి; నీటిజల్లులం
బెల్లుగ నాని ప్రొయ్యిఁ దగిలించిన కట్టెలతోడి వంటకుం
జిల్లులువోవుచుండెఁ బొగచేఁ గనుఁగోనలు పాచకాళికిన్.
103
క.‘అరచేత నగ్నిఁ గొను నే
ర్పరులు దివాణంపు విప్రపాచకు’ లను సు
స్థిరతరమగు పరువునకుం
గరము జలాంజలులు విడువఁగా నగునేమో!
104
గీ.స్వామి సెలవగుచో నాకసమ్ముమీఁదఁ
దెఱపి యొకకొంత పరికించి మరలఁ బిలిచి
నడపవచ్చు సమారాధనమ్ము లనుచు
మంచిదో కాదో యీపేదమదికిఁ దోఁచు.
105
మ.అనఁగా, నావినఁగానియట్టి తుదిప ల్కాలించి, యాలించినం
తనె తంజాపురినాయకుం డశనిపాతంబట్టు కాఁగా, బిరా
లునఁ గన్గోనల విద్యుదుజ్జ్వలితవల్లుల్‌ నించి గర్జించె ని
ట్లనిదంపూర్వ గళారవోద్ధతి భుజిష్యశ్రేణి కంపిల్లఁగన్‌.
106
శా.“ఏమీ! మావ్రతనిష్ఠకున్‌ వెలితియౌనే! యిట్లు దుర్ధర్ష వ
ర్షామేఘార్భటి వ్రీలకున్న నుపవాసం బుంతురో! భూసుర
గ్రామంబున్; వినరానిమాట యిది; యాకాశంబు క్రిందైనఁగా
నీ మాయీనియమంబు డిందువడఁజన్నే! కాదు కా దెన్నఁడున్‌.”
107
గీ.అనినఁ దంజాపురీంద్రుగర్జనము వినుచు
భావశబలత నైంద్రచాపమ్ముఁబోని
యా ధరానేత కనుబొమ్మ నరసి వడఁకి
త్రుళ్ళి సత్రాధిపతి పల్క నీళ్ళునమలె.
108
క.పఱచిరి గడగడ వడఁకుచు
వరవుడు లాఱేనిగళరవంబును విని, యం
బర మరయుచు ఘనసంభ్రమ
భరితుఁడు సెలవుగొని సత్రపతియుం బోయెన్‌.
109
సీ.కోటఁ బ్రాఁబడియున్న గొప్పమిద్దియల దూ । లము లగ్ని కిచ్చి భక్ష్యములు వండి
వెలమించు నగిషీపనుల మేలిమంచమ్ము । లాహుతిగాఁగ భోజ్యములుచేసి
శిల్పరేఖలతోడి చేతికఱ్ఱలు ప్రొయ్యి । కంటించి పొగచి లేహ్యము లమర్చి
పట్టుబట్టలు నేతఁ బెట్టి వెల్గించి కూ । ష్మాండ సమృద్ధచూష్యములు కూర్చి
 
గీ.స్విష్టకృద్భోజనములు సంతుష్టి నిడఁగ । దినము పండ్రెండువేల్‌ విప్రజనము కుడిచి
వానఁదడియుచుఁబోవ నాపైనిఁ దాను । రెండుమెతుకులు జయరాఘవుండు మెసవు.
110
గీ.తెఱపియిడినట్లె యిడి యిట్టె తేఱిచూడఁ
జదరగాఁ జాఁపగాఁ దోఁచి జలదమొకఁడు
క్షణములో నంగుళాంగుళోల్బణత నంది
చదలఁ బొదలారి ఘోరవర్షమ్ముకురియు.
111
శా.ఉగ్రాణమ్ముల నూరియంగడులలో నున్నట్టి తైలాజ్యభాం
డగ్రామమ్ముల ముంచి మేల్‌జిలుఁగుబట్టల్‌ దివ్వటీకట్టెలై
వ్యగ్రస్వాంతత రాఁజఁబెట్టి యెటులో వండింత్రు సత్రాధిపుల్‌
సుగ్రీవాజ్ఞయుఁగాక ఱేనిది మనశ్శుద్ధాజ్ఞగా నెంచుచున్‌.
112
గీ.అణువణువు ప్రొయ్యి పెనుచెమ్మయైనయపుడు
గగనవీథికిఁ బరువిడుపొగలె కాని
మావిచివురంతయేనియు మంటరాదు;
వచ్చునో, పాచకుల కంటివాన వచ్చు.
113
గీ.ముసలితండ్రిది పెత్తనమ్ము సడలించు
కలియుగములోని తనయుల చెలిమికాఁడు
సలిలదేవుఁడు తంజరాష్ట్రమ్మునందు
జ్వలనునకుఁ గల్గు తొలిచెల్లుబడి నడంచె.
114
గీ.ఉడికియుడుకక పొగచూఱియున్నవంట
విప్రులకును వడ్డింపఁ దప్పినదికాదు
ప్రాణిదేహాశ్రితుండు వైశ్వానరుండు
‘నమృతమ’ స్తని దానినే యారగించె.
115
చ.ఇఁక మఱునాఁడు వంటయగు నెత్తు రవంతయు లేకపోయె; నే
లిక కనుజంటలోఁ గళవళించు క్రుధాజ్యలదగ్ని నొక్క ని
ప్పుకయును వంటప్రొయ్యిదెసఁ బోవదు; పాపము ఘోరధూపమై
మొకములు ముక్కు లొక్కటిగ మూల్గిరి దిక్కఱి సత్రసూదకుల్‌.
116
మ.అవరోధాంబుజనేత్ర లయ్యెడల వాత్యావృష్టిపాతోద్భ్రమ
ల్లవలీవల్లికలట్లుకాఁగ నతివేలక్షుద్వ్యథా క్రుద్ధుఁ డ
భ్యవహారార్థము గంటమ్రోఁగమిని దంజాధీశ్వరుం డెచ్చి మూ
డవనేత్రంబును విచ్చునట్టి హరుఁడౌటం గాంచి రాస్థానికుల్.
117
దేవీకటాక్షము
ఆ.వె.విజయరాఘవుండు వీరరుద్రుండుగా
నవఘళించువేళ నద్వయాత్మ
విస్ఫులింగ మొకఁడు వెడలి శ్రీరంగ దే
వాలయాంతరమ్ము మేలుకొనియె.
118
మ.తనదాసుండగు తంజభూవిభుని శ్రద్ధాయుక్తికిన్‌ మెచ్చి, యా
తని వీరవ్రత నిష్ఠ చెమ్మగిలి డిందంబోవ శ్రీరంగనా
థుని దేవేరికి జాలి వుట్టుటయుఁ దోడ్తో నామె తేజోఽనలం
బున సత్రాన్నపు వంటగుండిగల వార్పుల్‌ వచ్చె నబ్రంబుగన్.
119
గీ.అమ్మవారి కృపా కటాక్షాంచలముల
కందవలసిన సర్వాభినందనములు
పురుషకారపుఁబొగఁ గనుల్‌ మూఁతవడఁగ
సిగ్గిలక సత్రపాచకశ్రేణి పొందె.
120
వ.విజయరాఘవనాయకుని వీరవ్రతంబున కంతరాయం బంటక నాఁటివంట శ్రీరంగనాథదేవి యమృతపాణిం గృశానుండు వుట్టిగట్టెక్కించుటయు నెప్పటియట్ల పండ్రెండువేలమంది తిని త్రేన్చి; రవ్వెంట రాణివాసంబుతోఁ దంజాపురీ పాకశాసనుని యారగింపు లయ్యెఁ; దంజనగరమ్మున నీ కథ యిటులుండ నట శ్రీరంగపురంబున.121
రంగధామేశ్వరి ముంగర మాయమగుట
మ.అరుదై యెవ్వరు నెప్పుడున్‌ వినని తీరై రంగనాథాలయో
ద్ధుర దుర్ధర్ష కవాటబంధములు చేతుల్‌ సోఁకనట్లుండ, న
చ్చెరువై వేలకువేలు విల్వగల యా శ్రీరంగానాథేశి ము
క్కర యేమాయెనొ! యొక్కనాఁ డెగిరిపోఁగా నుద్భ్రమోద్వేగియై.
122
మ.ఇది పూజారుల చేతనైన పనిగానీ! యెవ్వరేఁ జేసిన
ట్టిది కానీ, సయిరింపనంచుఁ బెనుధాటిన్‌రేఁచి త ధర్మక
ర్త దయాపేతము చేతమార మివులన్‌ దండింప శాసించె బె
ట్టిదుఁడై స్థానికపాళి మొఱ్ఱలిడఁ బాటింపండు నిర్దోషితన్‌.
123
ఆ.వె.పోయెఁగాక! యాణిముత్యాల ముక్కఱ
యమ్మవారి ముక్కునంద మింత
కుందలేదు కాని, డిందెఁ బూజారుల
ఘ్రాణవీథి నూర్పుగాలివిసరు.
124
గీ.ధర్మకర్త విధించిన దండనమున
ననపరాధులు నిజ చరణార్చకులకుఁ
దొనఁకు యాతనఁ గని నవ్వుకొనిన తల్లి
రంగనాయిక మది దయారసము వెల్లి.
125
చ.ఇఁకఁ గలరూపు దాఁచి వచియింపకయుండిన స్వాధికారిహిం
సకుగుఱియైన పూజరులచావు నిజంబనియెంచి రంగనా
యకమణి రాణి యొండు మనసై యొక పండిన పేరఁటాలి భ
క్తికిఁ బరశక్తి నించి పలికించె యథార్థము నామెగొంతునన్.
126
చ.మఱకువచెల్లునే! భువనమంగళదాయిని, రంగనాథు పే
రురమునఁ గౌస్తుభచ్ఛవుల నోమిన యిందిర నేను; భక్తిబం
ధురులగువారి యిక్కటులు త్రోలఁగవచ్చితి; మచ్చరించి క
న్మొఱఁగఁ దలంతు రెవ్వరు ననున్‌ బరిమార్చెద వారిఁ గ్రచ్చఱన్‌.
127
ఉ.దారుణమైన దండనవిధానముతో హరిభక్తులైన పూ
జారుల నింతసేఁత కలుషంబగు కార్యము; దోసమొక్కచో
వేఱొకచోట రోస మురవే! యిది యెక్కడిదైన న్యాయపుం
ధోరణి! దూరదృష్టివలదో! యిటువంటివి సేయుజాడలన్‌.
128
చ.జరిగినదంతయున్‌ వినుఁడి సాంతము! తంజపురాంధ్ర నాయకో
త్తరత వహించి నాయడుగుఁదమ్ములఁ దుమ్మెదగాఁ జరించు నే
ర్పరియగునట్టి శ్రీ విజయరాఘవభూపతిదక్క - నాదు ము
క్కర హరియింప శక్తుఁడునొకం డెటఁగల్గును భక్తసంతతిన్!
129
ఉ.అచ్చెరువందఁగాఁ బనియె! అంతటియేల్బడి సాగు ఱేఁడు పా
టచ్చరుఁ డౌట లేదనకుఁడా! యిది నేఁటిది కాదు; సంతతా
భ్యుచ్చయ ధర్మమర్మ సుగుణోదధి యాతఁడు నాదయాసుధన్‌
మ్రుచ్చిలె నెన్నఁడో; యిపుడు ముక్కఱ లెక్కయె వానిముంగలన్!
130
చ.తఱుగనివానతో నెలలు దాఁటెను; దంజపురాంధ్రమండలం
బరిమురియై కమండలువునట్టులు కుత్తుకబంటి నీటితో
భరపడియుండ దండములువట్టుచుఁ దిండికిలేక పల్లటిం
చిరి ప్రజ లెందఱో; యది రుచించునె! నాయకరాజయోగికిన్.
131
శా.సానల్‌ దీరిన పాచకప్రతతి తంజావూరు సత్రాన్న దా
నానూనాత్త యశస్సమృద్ధి నొక యర్ధాంశమ్మె యాఱేనిపై
నానన్‌ మోపుచుఁ దక్కుఁ గల్గు సగపా లావంటతో నింగిత
జ్ఞానోదారతఁ జేయు వడ్డనలతో సాధింతు రాత్మార్థమున్‌.
132
గీ.వచ్చి తినిపోవు పేదలు, వారు కాక
దినము పండ్రెండువేల్‌ విప్రజనము తినినఁ
గాని తిననొల్లఁ డాస్థిరాజాని; వాని
వ్రతము మెలఁకువ పాచకవితతి చలువ.
133
ఉ.మొన్నటిదాఁక నీ నియమమున్‌ గడిమించక విప్రభుక్త శే
షాన్నము నారగించె విభుఁ డాదట; వానల వంటకట్టె లెం
దున్నవి యాహుతింపఁబడియున్‌ దడికఱ్ఱల వంట సాగమిన్‌
నిన్నటి ప్రొద్దు తంజధరణీపతి కోటకు వెల్గు దిద్దితిన్‌.
134
మ.పొగ పెల్లై తడివంటకట్టియల వార్పుల్‌రాక యాప్పాచకుల్‌
దిగులందంగని ప్రాకృతాంగనయుఁబోలెన్‌ బోయి యాప్రొయ్విరాఁ
జఁగఁ జేవైచితి వంటచేసితిని దంజావూర; నా సందడిన్‌
దిగజాఱెం బొగచూఱి ముక్కుకొసముత్తెం బింత గుర్తింపరే!
135
గీ.ఇపుడు యోజించి యపరాధి యెవఁడొ యెంచి
దండము విధించుటన్నది తగవుకాని
పాప మెఱుఁగని వారలఁ బట్టి చంపి
కట్టి దిగుదురె! ఘోరదుఃఖములరొంపి.
136
ఆ.వె.పరమభక్తి నన్ను భావించువారల
పజ్జ నుందునని యుపన్యసించి
శ్రోత లెల్ల నొసఁగు జోతల నెసలారి
లోకమాత యంతలోన విరిసె.
137
వ.రంగనాథుని గుడియేలిక యప్పలుకులు విన్నవాఁడు పశ్చిమబుద్ధి శ్రీరంగపురాధీశ్వరుండగు చొక్కనాథనాయని నమ్ముఖమ్మున కరిగి జరిగినది వినిచి చెఱఁబడ్డ పూజరుల విడిచిపుచ్చెఁ; బదంపడి కొందఱు పెద్దలు కలసిరాఁ దంజాపురమ్మునకుం జని విజయరాఘవ నృపాలు దర్శించి వినయభరితులై యావద్‌వృత్తాంతము విన్నవించుటయు నాఱేఁడు సంభ్రమించుచు నమ్మవారి యమోఘాభిమానమ్మున కంజలించి తానై మంత్రులవెంట నన్నసత్రశాల కరుదెంచి-138
ఆంధ్రనాయకరాజు ముక్తామణీ దర్శనము
చ.కడుకొని నల్లనౌపొగలు క్రమ్మినగోడల వంటసాలలో
వెడనెడఁ జూచుకొం చడుగువేయుచు వంగుచు బూదిప్రోవు లే
ర్పడఁ గనుచుండ నవ్విజయరాఘవు కంటికిఁ గ్రొత్త పంటయై
యడరెడు మబ్బుచాటు మెఱుపై మసి మానిక మానె నంతటన్‌.
139
ఉ.కామిత మిట్లు పూచినటుగాఁ దలపోయుచు నమ్మవారి నా
సామణి దోసిటం గొని ప్రశంస లొనర్చుచు మోదబాష్ప ధా
రా మధుపర్కపూజ లొనరన్‌ గనుదోయికి నద్దుకొంచు నా
భూమివిభుండు వేఁడె నిటు ముత్తెపుముక్కర చిత్తగింపఁగన్‌.
140
క.ఓ దివ్యమౌక్తికమ! నిను
నా దోయిటఁ గొంచెపఱచినాఁడను; భవదీ
యాదర దరహసిత రుచి
శ్రీదాసుని దోస మిది భరింపంగదవే!
141
గీ.విశ్వశక్తి వెలార్చు క్రొవ్వేఁడి యూర్పు
గాలిఁ జేడ్పడి లోకలోకములు వాఁడి
కమరిపోకుండ నమృతశీతముగఁ దనిపి
ప్రాణ మొసఁగెడు ఘ్రాణమణీ! నమస్సు.
142
గీ.నీవు లేకుండ శ్రీరంగదేవి విడుచు
శ్వాస ధాటికిఁ దాళుకోఁ జాలఁ గలమె!
అమ్మవారికైసేఁత యౌ నట్టిదాన
వేల! యీ నేల నుండెడిలీల నీకు!
143
శా.దాసీభూత సమస్తదేవతలు చేతఃప్రీతి నీ దీప్తి నెం
తే సేవింపఁగ సాగి వేగిరమ తల్లీ! రంగధామేశ్వరీ
నాసాగ్రంబున కీవు భూషణమ వైనంగాని యోగుల్‌ నిది
ధ్యాసధ్యానములందు ముక్కుకొస లందన్‌ లేరు నిక్కంబుగన్‌.
144
క.అని తనదోసిలి నాసా
మణిఁగాంచుచు వేఁడి దానిమహిమంబున కా
త్మనమస్కారము చేయుచుఁ
జనె నాయొడయఁడు మహానసమువెలుఁ గెడలన్‌.
145
మ.అపు డాభూపతియాన నొక్కగడెలో నత్యుజ్జ్వలాకారదీ
ప్తి పరాకాష్ఠకుఁ జెంద దివ్యరుచి సందీపించు కట్టాణిము
త్యపునాసామణు లిట్టె రాఁగ నవసంఖ్యన్‌ బట్టి శ్రీజాని ప
ట్టపుదేవేరినిఁ గాంచి కానుకలుపెట్టన్‌ లోన భావింపుడున్‌.
146
గీ.అమ్మవారిమణులు నపరాధవిత్తమ్ము
వేనవేలు మేలికానుకలును
భద్రపఱుపఁ బసిఁడిపల్లకీ శ్రీరంగ
పురముఁ జేరె వాద్యములు సెలంగ.
147
ఆ.వె.మచ్చుతునుక యొక్కమణిఁ జూపి మిక్కిలి
రెట్లసొమ్ము సంతరించితి నని
యమ్మవారి నాసికాగ్రమునం దోఁచె
మందహాసదీప్తి బిందురోచి.
148
వ.దక్షిణాంధ్రనాయకరాజమఘవుండు విజయరాఘవుండు శ్రీరంగనాథేశ్వరీ చరణసన్నిధానంబున నిలంబడి భక్తినిభృతాంజలియై యమ్మంగళదేవత కివ్విధంబున నివేదనం బొనరించుకొనియె-149
మ.కృతబుద్ధిన్‌ సకలాంధ్రభూతలవిభుండే యైనఁ గానిమ్ము; త
చ్చతురంభోనిధిమధ్య సర్వవసుధాసమ్రాట్టె కానిమ్ము; దీ
పిత కల్యాణమహోమనోజ్ఞము భవద్వీక్షాశశిజ్యోత్స్న సం
ప్లుతమై కాసినఁగాదె! ఱేనివెలుఁగుల్‌ లోకైకదీపాంకురా!
150
మ.అతివేలంబగు కాలవాహినికి లోనై మున్గిపోనీక మ
ద్వ్రతమున్‌ లెస్సఁ దలంచి యొడ్డునకుఁ జేర్పన్‌ ద్వత్కృపాలంబన
స్మితరేఖాద్యుతినౌకఁ జూపితివి చేసేఁతన్‌ గటాక్షించి యా
శ్రితరక్షార్థ నటద్దయామృతఝరీ! శ్రీరంగధామేశ్వరీ!
151
మ.క్షితిపై సర్వజనుల్‌ సుఖాభ్యుదయముల్‌ సెందన్, స్వధర్మానుబం
ధితమైయొప్పి విభుత్వనీతి యనురక్తిన్‌జింద, శిష్టావనో
ద్యతిమై నెత్తిన వీరఖడ్గమున దుష్టానీకముల్‌ డింద, న
ప్రతిమాన త్వదపాంగ మొండు వలదే! బాలార్కకోటిప్రభా!
152
మ.నితరాముద్భట సంగరమ్ములఁ గృపాణీపాణి శర్వాణి; వు
న్నతవిద్యావిలసత్ప్రసంగముల వీణాపాణియౌవాణి; వూ
ర్జితముల్‌ నైకవిధప్రభుత్వములు నీచేఁ గల్పితంబుల్; పదా
నత భక్తోత్కర చింతితామరమణీ! నారాయణీ! పావనీ!
153
మ.అతివృష్ట్యాదుల కీతిబాధలకు దవ్వై సర్వకేదార సం
తతులన్‌ సస్యము వేళ్ళఁ గొల్చుగను బండన్‌ సజ్జనానీక పా
లితముల్‌ ధేనుగణంబు కుండ పొదుఁగుల్‌ క్షీరమ్ము వర్షింప సం
భృతమౌ నీదయమొండె హేతువగుఁదల్లీ! సర్వభూతేశ్వరీ!
154
మ.ప్రతిభావద్విబుధుల్‌ మహాకవు లనల్పప్రీతిమైఁ బల్కు స
త్కృతులన్‌ వస్తు వలంకృతుల్‌ రసముఁ దాదృక్ప్రాభవశ్రీ సము
ద్గతమౌ నొండు ప్రతీయమాన రుచిరార్థంబున్‌ భవత్సుందర
స్మిత బిందూద్భవ వైభవం బగుఁగదే! శ్రీమత్సరోజాలయా!
155
మ.క్రతు సంతానము తీర్థరాజములు క్షేత్రశ్రేణియున్‌ గోత్రసం
తతులున్‌ వాహినులున్‌ వనంబులును విద్యావేత్తలున్‌ వృద్ధులున్‌
సతులున్‌ సర్వచరాచరాత్మక ధరాచక్రంబు హస్తాబ్జ ద
ర్శితమౌ నీదు నభీతిముద్రకయి కాంక్షించున్‌ ముకుందప్రియా!
156
మ.అతులైశ్వర్య వినీతభావరతులై యక్లిష్ట చారిత్ర వ
ర్ధితులై వంచక తస్కరాదిక భయాధివ్యాధి నిర్ముక్తులై
సుత పౌత్రాన్వితులై చిరాయువులతో సొంపారి యాంధ్ర ప్రజా
తతి పెంపొందుట నీఘృణాకలనఁ గాదా! తల్లిరో భార్గవీ!
157
మ.శతధా కౢప్త సహస్రధా వివృత లక్షానేకశః కోటిశ
స్తత విశ్వోదయ రమ్య రమ్యతర శశ్వత్సృష్టి కల్యాణి కా
రతి పాత్రంబును నెత్తు ముమ్మొదలి పేరంటాలివౌ నీదు కం
టితుదన్‌ వెల్గు వికుంఠనాయక చిరంటీ! యాంధ్రసామ్రాజ్యముల్‌.
158
ప్రభువృత్తముశ్రుతి నిగదిత మగుచును బెంపగు నచ్యుతధర్మముతో స్తుతరీతి జగ
ద్ధితమును మదిఁగొని ధృతిమన్మతి మర్దితశాత్రవులై తెలుఁగుంబుడమిన్‌
జతగొను ప్రభువులు సకలాంధ్రపురాణత నీదగు నుజ్జ్వల నిశ్శ్వసితా
ర్ద్రతఁ బొలుతురు హరిరమణీ! నవతాప్రతిభాసితగంధవహాగ్రమణీ!!
159
పర్వాంతము
మ.అమలోదాత్తము ధర్మనిర్వహణ మర్యాదమ్ము విద్యాకృత
శ్రమ మాయోధనరంగ సంగత పరోగ్రంపశ్య మాశాతటా
క్రమిత స్వచ్ఛయశమ్ము కావ్యకవితా కల్యాణనీరంధ్ర మాం
ధ్ర మహావీరచరిత్ర వించితిని దాతా! నీదు శుశ్రూషకున్‌.
 
గీ.ఎదుటఁ జెళపిళ్ళవేంకటబుధుఁడు రామ
కృష్ణకవు లాప్తబాంధవశ్రీల వెలయఁ
గొడుకు సత్కవి యగుటకుఁ గోర్కిపడిన
నాయనా! నీకు ఋణపడినాఁడ నేను.
 
క.అభితః పరిమళిత యశః
ప్రభవిష్ణులు సుకవిజన సభాజన లీలా
రభటీకాస్థానులు ప్రా
క్ప్రభువుల చారిత్ర మిటు పురాణింపఁబడెన్‌.
 
తత్సత్‌
నాయకరాజ పర్వము - ఆంధ్ర పురాణము - మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి - ఆంధ్రభారతి - కావ్యములు - ఆంధ్రపురాణము - ఆంధ్రపురాణం - ఆంధ్ర పురాణం మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి ( తెలుగు కావ్యములు ఆంధ్ర కావ్యములు) Andhra Puranamu - AndhraPuranamu - Andhrapuranam - andhra puranam - Madhunapantula Satyanarayana Sastry- AndhraBharati AMdhra bhArati - kAvyamulu