బాలకాండము-03
రాగం: భైరవి - తాళం: అట
పల్లవి:
వినవే సత్యవాణి శర్వాణి అలివేణి నీరజపాణి ॥వినవే॥
అనుపల్లవి:
నను గోరి భజియించి నను మదిలో నుంచి-
నను వరదుఁడనౌదు సంశయము లేదు
మునుపు ఇటులిది యడుగరెవ్వరును మహాయోగివర సంభా-
వనము జీవన మమృతసేవనము జన్మపావనము ॥వినవే॥
చరణములు:
శ్రీరామునకు నమస్కారము జేసి యనివారణనాత్మతత్త్వము నీకు వివరింతు
నారాఘవుఁడు శౌరి యజ్ఞానహారి జితారి శ్రీవిహారి మాయాధారి
తారకకీర్తి సత్యజ్ఞానస్ఫూర్తి విదారితార్తి దేవతాచక్రవర్తి చిదానందమూర్తి-
యై రాజిల్లు శ్రీహరి మాయకెల్ల నాధారమైనందువల్ల మోహము కల్ల
శౌరి ప్రకృతికి నాది నిజమాయారూఢి జగములు సృజియించి య-
నారతము నభము గతి వెలిలోను పూర్ణతను బూను ॥వినవే॥
వితతమాయచే నిర్మితమైన జగము విస్మృతి సూచిచుంబిత శిలచేతఁ బరిణమించు
గతియె కర్తృత్వము అతనికి లేదు దుర్మతులెఱుఁగ రీదారి కోర్కులుమీఱి
మతిహీనులైరి యేమనవచ్చు వారి సంసృతియె కోరి యందుచే బద్ధులైరి యామధుకైటభారి
అతిశుద్ధచిద్ఘనుఁడని తెలియక జ్ఞానమతనికిఁ గలదందురు భువిలోఁ గొందఱు
తత వసుద్యుతిలసన్మాలిక నుతగళాన్వితమయ్యు మఱిచిన
గతి మనస్థితుఁడౌ జగద్గురుని ఖలు లెఱుంగరని ॥వినవే॥
అకటా సూర్యునియందు నప్రకాశత్వము యొకనాటికైనను యున్నదే? యటువలెనే
ప్రకటమై జ్యోతిస్వభావ మాత్మునియందు పనిలేదు మాయవాదు వీవికమీఁద
అకలంక గనవే నిత్యము నమ్మి మనవే రక్షకుఁడనవే శేషశైలేశు గనవే భక్తియు చేకొనవే
అకుటిలునకు చాంచల్యము చెప్పుటలు చలదృష్టికి చూడ నునికిపట్టు భ్రాంతమైనట్లు
సకలకాలములను ప్రభామాలికి పగల్రాత్రి లేనటులా-
త్మకును జ్ఞానాజ్ఞానములు రెండు లేనివైయుండు ॥వినవే॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi