అయోధ్యాకాండము-07
రాగం: అసావేరి - తాళం: ఆది
పల్లవి:
హృద్వనిజార్చితరామా యాశ్రితజనకల్పారామా
సద్వచోభిరామా రామా వినవే ॥హృద్వ॥
అనుపల్లవి:
అద్వయముగ సుమంత్రుఁ డరదము గొని యయోధ్య కరిగి దశరథున కెఱఁగి ర-
ఘూద్వహుఁడు జానకీలక్ష్మణులను గూడి గంగకావల జన నృపుఁడు
విద్వన్నుత రామచంద్ర సీతావిభో జగత్పభో విధాత నిను మ-
హద్వైభవానుభవయోగ్యు నడవి నడల వ్రాసెనా యని యడలెను ॥హృద్వ॥
చరణములు:
పుడమిజనులు నిను దయగలవాఁడని పొగడగ వైకల్యమేటికి
అడరి నీదు కోరికలన్నియు నేఁ డకటా సాఫల్యమాయెను
వెడవెడ యేడ్వక యుడుగుమనుచు నుర్వీశుని గౌసల్య దూరిన
నిడుదకన్నుల నీరొడియునతని కా నుడియె హృదయశల్యమాయెను
పిడుగుపడినవాని కొఱవిఁజూడిన వడువున నేఁచెదు ప్రాణముల్ నిలవు
పడఁతి వినుము పుత్రశోకమునఁ దనువు వెడలుననుచు నొకముని తిట్టె దొల్లి
కడక నేను వని వేఁటలాడ ముని కొడుకొకఁడు రేయి నది ఘటము ముంచ
బుడబుడమన గజమని శరమేయ నతఁడు హా యతి ననె జనపతి ॥హృద్వ॥
డాయఁ జని యయో యని నే మునిపదతోయజములు దడవి యో ముని-
నాయక నేనపరాధిని దశరథ నరపతినని నుడివి మ్రొక్కిన
సాయకవేదనకోర్వలేను నా జననీజనకు లడవినొరలెద
రాయెడ కేగుము వైశ్యుఁడననిన శరమ్ము బెరికి నిడివి సేయక
తోయముఁ గొని చని హా కుమారకా హా యజ్ఞదత్తా యని జీరువారి
కాయత మతివల గొని యుదక మొసఁగి యయోధ్యావిభుడను దశరథుడ దంతి
నేయ మీ తనయుఁ డీల్గెనన నీవు మా యటులనె సుతునెడసినపుడె చని-
పోయెదవని గెడసిరని దెలిపి మృతుఁడాయె హరిహరీ యనుచు నృపుఁడు ॥హృద్వ॥
మోదుకొని యహా యని కౌసల్యాది ముదితలు విలపింప వసిష్ఠుఁ
డాదయితల వారించి శవము తైలముచేఁ గ్రాఁగింపఁ బంచటు-
మీఁద భరతశత్రుఘ్నుల బిలవనంపిన త్వర దీపింప వారే-
డో దినమే వచ్చి యయోధ్యఁగని భయ ఖేదములు జనింపఁ బురజను
లాదరింపమియు గని యిదేమోయని యంతిపురికేఁగి కైకకు మ్రొక్కిన
మోదమొదవి సుతుఁ గౌఁగిలించి తన పుట్టినింటి సేమమరసె భరతుఁడు
మేదినీశుఁడేడని కైకనడుగ విని సీతారామమలక్ష్మణుల నీ
మీఁది దయచే నడవి కనిచితి మృతుఁడాయెనా సొలసె నతఁడు ॥హృద్వ॥
కొంతవడికి సేదదేర భరతుఁడు కోపదృష్టిని జూచి కైకా
శాంతమూర్తిని గృపాళుని శ్రీరామచంద్రు నడవిఁ ద్రోచి భువిపతి
హంతవైతి వయయో నరకమునందు పడెదవే ఛీయని నే-
నెంత పాపకర్మికి కొడుకైతి నింకేల ననుచు లేచిపోయి
కాంతుఁ బాసి వనరెడు కౌసల్యను గాంచి పాదములపైఁ బడి యేడ్చిన
చింత యేమీ నీవు కైక కరుణను శ్రీమంతుఁడవైతని జనని పలుక
యింత కైకకృత మేనెఱిఁగిన గురుహింస జేసినట్లనఁ గౌసల్యా-
కాంత తనయు గౌఁగిట నిడికొని యాక్రందించె మహారవమెసఁగఁగ ॥హృద్వ॥
అపుడు వసిష్ఠుఁడు వచ్చి భరతుతో ననియె వగచుటేలా దశరథుఁ
డపరిమితసుఖము లనుభవించి దివి కరిగె జ్ఞానశీల జీవుఁడు
చపలజన్మమృతురహితుఁ డమలుఁడు శాశ్వతుఁడు త్రికాలాబాధ్యుఁడు
కపటశరీరమె జడ మనృత మిందుకై వికారమేలా మూఢుఁడు
అపవిత్రమైన సంసారదుఃఖాహతులై బాంధవులు దెగిరని పొగలు
నిపుణుఁడు జీవితము చిగురాకుకొన నీర బిందువునుగాఁ దలఁచుననుచు
కృపచే నెఱిగింప నృపుని తనువగ్నిచే దహించి క్రియల్ చేసి సోద-
రపురస్సరుఁడై భరతుఁడు శేషగిరిపతి రామునిన్ జూడఁదలఁచె ॥హృద్వ॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi