అరణ్యకాండము-02
రాగం: మంగళకౌళిక - తాళం: ఆది
పల్లవి:
వీనుల విందుగను వినవే యీ చరిత మిమ్ముగను ॥వీనుల॥
అనుపల్లవి:
శ్రీనివాసుని బూజించి సుతీక్షణుఁడు సమ్మానముగాంచి సానందుఁడై పలికెను ॥వీనుల॥
చరణములు:
రామ నీ తారకనామమంత్రజపము
నేమమునజేసితి నీరజాక్ష
శ్రీమహిళాధీశ శివవిరించిసేవ్య
కామసంసారసాగరతరణచరణాల యని ॥వీనుల॥
సతిసుతాదిఘోరసంసారాంధకూప
పతితుఁడనై పాపమతినై
గతిగానని నను గన నిర్హేతుక దయా-
మతివై నీవే వచ్చితివనెను సంయమి ॥వీనుల॥
సకలభూతమానసాలయుఁడవైనను
బ్రకటించి నిన్ను జపమ్ము సేయని
వికలుల మాయావివశులుగ జేతు
వకట నిను భజియించ నఘము బాపుదువనెను ॥వీనుల॥
విశ్వసృష్టిస్థితినిలయముల కజహరి-
విశ్వేశరూపముల వెలయుదీవు హరి-
దశ్వుఁ డనేకపాత్రముల గనబడు భంగి
శాశ్వతుఁడ విది మూఢజను లెఱుఁగరనె దపసి ॥వీనుల॥
పరమేశ ప్రకృతికిఁ బరుఁడవౌ నీ దివ్య-
చరణముల్గంటి దృక్స్వాంతములకు గో-
చరుఁడవు గావైన హరి నీ నామస్మరణ
పరమతుల కెపుడు గనుపట్టుదువనె మౌని ॥వీనుల॥
రూపాద్యుపాధిదూరుఁడవైన మాయానట-
నాపాదితమౌ నీ మానవరూపము యిది-
గో పొడగంటి స్మరకోటిసుందరము శర-
చాపాన్వితము కరుణాశ్రయనేత్ర యనెను ముని ॥వీనుల॥
స్మితలలితాస్యము సీతాయుత మజినాంబర మ-
జితము సౌమిత్రిసేవితపాదము న-
ప్రతిమ మసితోత్పలాభము మద్భాగధేయ
మతిశాంతమగు నీ శుభాంగము గంటిననె ॥వీనుల॥
దేశకాలకర్మాతీత విజ్ఞాన మఖి-
లేశ నీ రూప మతిహిత మమలము
నాశరహితము స్వప్రకాశము నిఖిలావ-
కాశము చిద్ఘనాకాశమని పొగడె ముని ॥వీనుల॥
ఈ రూపు భావించి యికనొకటి నా మనసు
కోరలేదనిన మునితో రాముఁడు చె-
న్నారగఁ బల్కె మునినాథ నీ మది మత్స-
మారాధనమున నిర్మలమౌ టెఱుఁగుదుననె ॥వీనుల॥
మీవంటి భక్తులఁ బ్రోవ వచ్చితి నన్ను
భావించి వినుతించి సేవించి మా-
కీవేగతి యనువారి కెపుడుఁ జూపడుచుఁ
గోవిందుఁడ వీవు ముక్తుఁడ వైతివనె జక్రి ॥వీనుల॥
ఈ పావనస్తోత్ర మెవరు పఠించినఁ
దాపత్రయమ్మును బాపుదురు
దీపించి మద్భక్తి దృఢమౌ సుజ్ఞానము
ప్రాపింతురు పరమపదమనెను రాఘవుఁడు ॥వీనుల॥
మన మగస్త్యుని జూడ జనవలెనని సుతీ-
క్షణయుతుఁడై సీతాలక్ష్మణులతోడఁ
జని యగస్త్యానుజుని గని యవల శేషశై-
లనివాసుఁ డగస్త్యాశ్రమముఁ జేరి నుతించె ॥వీనుల॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi