కిష్కింధాకాండము-05
రాగం: యమున - తాళం: రూపక
పల్లవి:
ఫణిశయనుని చరితము విను దాక్షా-
యణీ భక్తజనపరాయణి ॥ఫణి॥
అనుపల్లవి:
గుణనిధులౌ దాశరథులు ప్రవర్షణాచలశిఖరస్థ విలసత్ఫలసుమతరు
గణవృతమై బహువర్ణమృగవిహగసేవితమై
మణిఘృతమై వర్షవాతసహమగు నొకగుహ నుండిరి ॥ఫణి॥
చరణములు:
శ్రీనివాసుడు నరాకృతిఁ జేకొనినాఁడని మౌనివరులు సురలు కరమనురాగమున
మానితఖగమృగశరీరులై సేవింతురు పూని యనుదినము రాముని యహోరాత్రుల
ధ్యానమానసికుఁడై లక్ష్మణుఁ డేకాంతమున వికసితముఖుఁడై తగురఘుపతిని జేరి
భానునిభా నీచే మునువిన్న బోధ నే మఱచితిఁ గాన సులభమౌ క్రియాసంయోగము సెలవిమ్మనియెను ॥ఫణి॥
అనుజుఁడ ననుఁ బూజించగ నంతములేదైన విను సంక్షేమముగా
వినుపింతు గురుదయ ననుపమమంత్రోపదేశమై ధీమంతుఁడు
మొనసి గురునిచేఁ బూజావిధి తెలిసి తనను సభక్తికముగా నారాధించి ప్రాత-
స్నానాదకమగు నాహ్నికములొనర్చి శిలాస్థాపనముజేసి కృతసంకల్పుఁడై గంధకుసుమాదుల
నను ప్రతిమాదిపూజ సేయగవలెననె రాముఁడు ॥ఫణి॥
నా సన్నిధి భక్తి నేమియొసఁగిన నేనందుననె యలరుదు చాలా భక్ష్యభోజ్యచందన-
వాసోముఖ పూజాద్రవ్యములు దెచ్చి సిద్ధాసనమున దేవుని యెదుటఁ గూర్చుండి లీలా-
భాసుర బహిరంతరమాతృకాన్యాసంబులు గేశవాదికము మూర్తిపంజర-
న్యాసంబులు జేసి హృదబ్జరవివిమలజీవకళా
ధ్యాసియై శిలాదులకు కలాసిద్ధిఁ జేయవలెననె రాముఁడు ॥ఫణి॥
హృదయావరణాది పూజ లాగమవిధి నొనరించి యర్ఘ్యపాద్యాచమన మధుపర్క
సదమల ధూపదీప నైవేద్యనీరాజనాది విదితోపచారముల నర్చించవలెనన్న నవిద్య
పొదలుచు నగ్ని ప్రతిష్ఠాపనంబు చేసి యగస్త్యోక్తమార్గమున హోమము వే-
ల్చి దహనుఁ దప్తసువర్ణసముగ మణిభూషణుగ విష్ణు-
పదస్థితుగా బుధుల్ సదా భావింతురనెను హరి ॥ఫణి॥
బలి పార్షదులకు నిడిన మంత్రజపముజేసి చెలఁగి విడెమిచ్చి నృత్యగీతవాద్యము
లలరగ నా ముందర స్వస్తివచనాదులు సలిపి నా ప్రసాదము శిరసా వహించి హెచ్చి
లలి దండమర్పించి కరయుగళి నా పాదజలజంబులు స్పృశించి తలనుంచి మహాసంసృతి
వలన బ్రోవుమనియు ధ్యానమును చేయునతఁ డిహపర-
ములొందునని శేషగిరినిలయుఁ డనుజన్మునకుఁ దెలిపె ॥ఫణి॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi