కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
సుందరకాండము-04
రాగం: నాటకురంజి - తాళం: ఆది
పల్లవి:
విను రఘువరచరితము పార్వతీ వినుతమేచకాకృతీ ॥విను॥
అనుపల్లవి:
హనుమంతుఁడు జానకితో భాషింపంగ ననువౌతఱి యిదియని తాఁ బలికెను ॥విను॥
చరణములు:
మనువంశ్యుఁడు దశరథుఁడను నృపుఁడిలఁ దనరు నాదొరకు నల్వురు
తనయులు రామలక్ష్మణభరతశత్రుఘ్నులనువారలు రాముఁడగ్రజుఁడా నల్వురకు
జనకాజ్ఞ నడవికేఁగి సీతాలక్ష్మణులతోఁ బంచవటినుండ రావణుఁడు సీత
నినకులులను వంచించి కొని చనె వెదకి జటాయువు గాంచి
జనపతిఁ జూడ నిన్ను సుగ్రీవు చెలిమిగని వాలిని గీటడంచెననె మారుతి ॥విను॥
వైదేహి నరయ నాల్గుదిక్కులకు వానరులను బంపఁ గొందరము
ఈ దెస వెదకఁగ వచ్చితి మందు నే నీవారధి దాఁటి లంకఁజొచ్చి తిలకింప
నాదు భాగ్యరమయన నశోకవని నవ్యశింశుపాతరువు క్రింద నాతల్లి-
ని దేవతామతల్లిఁ దనునిందిత హైరణ్మయవల్లి
నే దర్శించితి సీతననుమాట మేదినీసుత విని మహాద్భుత మొందెనెద ॥విను॥
మిన్నుమ్రోతయో పవనుని పలుకో కన్నకలయో నేను రామకథ
యెన్నాళ్లకు వింటిఁ గర్ణామృతముగ నెన్నఁడు నిద్రలేదు కలగాదు సత్యమైతేను
కన్నుల యెదుట ప్రసన్నుఁడౌ గాకనిన మ్రాను దిగివచ్చి సీతకు మ్రొక్కి
పిన్నపిచ్చుకంతటివాఁడై వినతారుణముఖుఁడై యచటివా
రెన్న నంజనీసుతుఁడ శేషాచలేశుఁడైన రాముని దూత నేననెను ॥విను॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi