కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
సుందరకాండము-05
రాగం: శహన - తాళం: త్రిపుట
పల్లవి:
వినవే యాననజితచంద్రబింబ హేరంబజనని వరసరసగుణమణినికురుంబ ॥వినవే॥
అనుపల్లవి:
జనకసుత చిఱుతతనువొందిన హనుమం-
తుని గని రావణుని మాయలని బలుకక యుండె ॥వినవే॥
చరణములు:
తల్లి నే మాయకుఁడ గానానందవల్లి గుణముల పాల-
వెల్లి నా యందరమరలు మానుమిఁకను నింతసేయఁ-
జెల్లు నా కోసలపురీధాముఁడై తగు నల్ల శ్రీరామదాసుఁడను మారుతసుతుఁడ
నల్ల సుగ్రీవుని మంత్రిని నేను
కల్లగాదంచు నంజలి యొనరించు కపిఁజూచి నరవానరుల కెట్లు పొందగుననె సీత ॥వినవే॥
మాయమ్మా రావణుఁడు నిన్‌ గొని చనిన చాయ వెదకుచు నృపుఁడు
బోయ చెలిచే నీ తెఱఁగు విని పంప కడన్‌ వసింప
రాయబారమంపె నను సుగ్రీవుఁడచటికి బ్రహ్మచారినై చని వారల యభి-
ప్రాయమెఱిఁగి రాకొమరులఁ దెచ్చితి
ఆయె నరవానరేంద్రులకు చెలిమి ఖలుఁడౌ వాలిని రాఘవుఁడు జంపెననె నంజనీసుతుఁడు ॥వినవే॥
మాత నిన్నారయఁ గపులఁ బంచి నీచేత నన్నియు నగును
వాతాత్మజ మన లక్ష్మణుల మేలు నా సేమము దెల్పి
సీతాసతికిమ్ము ముద్దుటుంగరమని హరి యొసఁగె జేకొని ప్రయత్నమునం దెచ్చితి నృపతి
చేతిముద్రికయని సీత కతఁడిచ్చెను
ప్రీతిచేఁ గొని శేషాద్రీశుఁడౌ రామవిభు నామాంగుళీయక మౌదలఁ దాల్చెను సీత ॥వినవే॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi