సుందరకాండము-06
రాగం: యదుకులకాంభోజి - తాళం: అట
పల్లవి:
రామదాసుఁడవౌ నీవు హనుమంతా రావయ్యా యనె కాంత ॥రామ॥
అనుపల్లవి:
క్షేమమా సూర్యవంశాంబుధిపూర్ణసోముఁడైన శ్రీరాముఁడు ఆ లక్ష్మణుఁడు ॥రామ॥
చరణములు:
ప్రాణదాతవు జగత్ప్రాణకుమారా భూసుతవిహార పుణ్యవిచార
మానిత కల్యాణక్షోణీధరాకార మహితానందసారా కంటి-
వా నా యిడుములు భూనాథుని దయరా నా మనవి పవనాత్మజ దెలుపు
మానాడు నేనాడిన మాటల కలగవలదని నా మఱఁదితో
భానుసన్నిభునితోఁ దెలుపుము పరమధార్మికత ధారుణి విలసిల్లుము ॥రామ॥
గడువు రెన్నెలల దాఁకా హరి రాకున్న చెడుగు రాక్షసులు భక్షింతురు నన్ను ఆ-
రడి సేయు రావణుని మడియించి జయము గొన్న కడుకీర్తియనవన్న పతితోఁ
దడవు వలదని నుడువు కరి తుంగమడువుఁ జొచ్చిన వడువున లంక
వడి జొచ్చి దానవుల వ్రచ్చి యవార్యత ఖగేంద్రుఁ డమృతముఁ గొను
కడఁక రాముఁడు నన్ను గొని చనఁగా బ్రయత్నము సుయత్నముగఁ జేయు ॥రామ॥
నాచే నీ యునికి విన్నపుడె సానుజుఁడై రాచూలి వచ్చి రావణుఁ ద్రుంచి ఘనుఁడై
యేచి యయోధ్యకు నిదె నిన్నుఁ గొని చను నింద్రాది సురనుతుఁడై యన
వాచాలతక నిట్లు చాటెదవబ్ధి కీచయ వారెట్లు దాఁటుదురనిన
ఓ చంద్రముఖీ రాఘవుల నా మూఁపున వహించి దెత్తునిటకు
నా చేతికానవాలిమ్మనినను నమ్మి నెమ్మి చూడామణి యొసఁగె ॥రామ॥
శ్రీరాముఁ డొకనాడు చిత్రకూటగిరి కోరి నాతొడలపై గూర్కియున్నతఱి
మీఱి యొక కాకి యామిషమని నా కాలిబొటనవ్రేలు జింపెను డగ్గరి నిద్ర
దీరి మారీచవైరి కాకిపై పూరి మంత్రించి కేరి యేయ శరమై
గారింప ముజ్జగము దిరిగి కావుమని రాముని వేడఁ గ-
న్నీరు నీరసముఁ గాదన కన్నిచ్చి చనెనది యెఱుకసేయుము పతికి ॥రామ॥
చిఱుతవీ రక్కసుల చిక్కులఁ బడక జరుగనెట్లగుననిన జనని నా నడక
యెఱుఁగవు మిన్నంది పెరిగెద భయముపడక వీక్షింపుమని కడఁక తెలియ
హరివీరుఁడు దాల్చె నరివీరభయంకరవిగ్రహము శ్రీహరి విష్ణుఁడు త్రివిక్రమశ-
రీరమును ధరించు తెఱంగున ధరణీధరాభమగు నీ తను-
వరయ నా తరమె శేషాద్రీశ్వరుని రఘువరుని జేరఁగఁ జనుమింకను ॥రామ॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi