యుద్ధకాండము-04
రాగం: సావేరి - తాళం: అట
పల్లవి:
కామలీలాకార్ముక విజయ భ్రూలతా-
ఖిలపావన సువ్రతా హిమశైలసుతా వినవే ॥కామలీలా॥
అనుపల్లవి:
ధీమంతుఁడగు విభీషణుఁడు నల్వురు మంత్రులతో వచ్చి దివిని నిల్చి రాముని
శ్రీమహితనాముని పాదనీరేజాతములఁ జూచి నతుఁడై
రామా రాజీవలోచన నా సామీ వినుమని పలికె ఘనముగను జెవులపండుగను ॥కామలీలా॥
చరణములు:
నే విభీషణుఁడ నీసతిని మ్రుచ్చిలినట్టి రావణుని తమ్ముఁడను రామా అన్న-
చే విడువఁబడితి గుణధామా యింక నీవేగతి ఘనశ్యామా సీతా-
దేవి రామునికిమ్మని దశముఖునితోఁ దెలిపినఁ జంపవచ్చెను రణభీమా ఆ
దేవారికి వెఱిచి నే వచ్చితి నే నీ సేవార్థము దేవదేవ దీనులకు
నీవే దిక్కనిన నుడి విని సుగ్రీవుఁడితని నమ్మకుము మా-
యావి పగతుని యనుజుఁడు బలియుఁ డనఘ సెల-
విమ్ము ద్రుంతు సచివులతోననియె రఘుపతితో వినవె ॥కామలీలా॥
ఇనకులమణి రవిజుని మాటవిని నవ్వి యనె నేఁ దలఁచిన మాత్రమున జగము-
లను జగత్పతుల నిమిషమున ద్రుంతు జననమొందింతు వేగమునఁ దెమ్మా
దనుజుని సకలభూతాభయదానకంకణము గట్టితి నే లోకమున ననిన
జననాయకుఁ బొగడి దిననాథాత్మజుఁడో యన నా విభీషణనాముని దెచ్చి కనుపింప
గని మ్రొక్కి రాముని ఘనశ్యాముని విశాలాక్షుని
మనోజముఖాబ్జుని ధనుశ్శరమహితకరుని బ్రశాంతుని లక్ష్మణాన్వితుఁ బొగడఁ దొడంగె విను ॥కామలీలా॥
శ్రీరామ రాజలలామ మ్రొక్కెద నీకు సీతాహృదయాభిరామా
ధనుర్ధారిపూరితభక్తకామా శాంతాకారా యనంతశ్రీధామా నమ-
స్కారము సుగ్రీవమిత్ర జేజే నీ కంజలి రఘువర సార్వభౌమా జగము
గోరి పుట్టింపఁ జేరి రక్షింప మీఱి శిక్షింప నీరీతుల కాది-
కారణంబగు నీకు నతి త్రిజగద్గురుఁడవై తగు నీకు జో-
హా రనాదిగృహస్థవగు నీ కమితసాష్టాంగములు చేతు హరీ నుతవాగ్ఘరీ యనెను విను ॥కామలీలా॥
చరాచరభూతములు వెలితో వ్యాపకస్వరూపమున వశించియుండు-
టెఱుఁగ రజ్ఞులు మాయనుంచి యెఱుక మఱచి జన్మమృతులు గాంచి యెపుడు
తిరుగుచుందురు శరణాగతులఁ బ్రోవవే దేవ దయారసము నించి సుజనా-
దరణీయము గాదు ధరణీధర లోకసరణి శుక్తిరజతము కరణి భ్రమయని
యరయ కజ్ఞులు పుత్రదారగృహాదులం దాససేయుచు విష-
యరతులగుదురు తుద నవి శోకకరములగు సుజనుఁడిది గను వరదా పాలితద్విరదా యనెను ॥కామలీలా॥
నీవే యింద్రుఁ డీశానుఁ డాద్యంతమైన దిగ్దేవతలు నీవణువుకన్న నణువు
నీవు గొప్పవు గొప్పకన్న ద్రిభువనావళి తలితండ్రి వన్న నీవె
నీవాదిమధ్యాంతరహితుఁడవు పూర్ణుఁడవు నీవవ్యయుఁడవు సుప్రసన్న శిరో-
గ్రీవశ్రోత్రవక్షఙ్నేత్రశ్రేణి వజితుఁడవు మాయావాసనాసాక్షివి
నీవు ద్రష్టవు శ్రోతవు గుణాన్వితపంచకోశాతీతుఁడవు
నీవనాశ్రయుఁడ వవికారివి భావరహితుఁడ వాదిపురుషుఁడవు ప్రకృతి కవ్వలివాఁడ వనె ॥కామలీలా॥
మాయచే నిజరూపు మఱువిడి నరునివలె మహిఁజూపట్టితివ గుణియించు నను ని-
ర్మాయకునిగాను నిలుచు మహితధీయుతుఁడు మోక్షముగాంచు గాన
నీ యంఘ్రిభక్తియను నిచ్చనచేఁ గందు నీచిత్సుఖపు మేడ నంచు యోగి-
ధ్యేయ సుజనవిధేయ శుభనామధేయ ప్రణతగాధేయ నను బ్రోవుము
శ్రీయుతాంఘ్రులకు నతి యని నుతిఁ జేసిన విభీషణుని గని రఘు-
నాయకుఁడు హితము గోరుము ఇపుడే మొసంగుదు దనుజకులతిలకా యని పలుక నతఁ డుప్పొంగె ॥కామలీలా॥
నేను ధన్యుఁడ గృతకృత్యుఁడనైతి నినుగంటి నీదయగంటి బ్ర-
హ్మానందము చేకొంటి జగతిలో నెవ్వఁడు నరువంటి ఘనుఁడు
నేనొల్ల సతీసుతసంపదల హరి నీయందే భక్తియుండవలెనంటి నట్ల-
గానిమ్మనన సురజానిన్ మదిమెచ్చి నేనెమ్మదిలో నిన్నె నమ్మితిననిన
వాని మది సీతాసమేతుఁడనై నిల్తు నకుటిలుఁడవై నను
ధ్యానించు భవజలధి దాఁటు మనన్య మీస్తవము దీనిఁ బఠించు నతఁడు కోర్కులు గాంచుననె ॥కామలీలా॥
నను గన్న ఫలమిప్పుడే గాంచు వీఁడు లక్ష్మణా లంక యేలింతు జూడు జలము
గొని తెమ్మభిషేకింతు నేఁడు శిరుల దనర దీవింతు నీతోడు యెంత
దను కాచంద్రార్కు లెందాఁక యిల నా కథ యెందాఁకనుండు నందాఁక వీఁడు రాజ్య-
మును జేయునటంచు మనుజేంద్రుఁడు బల్కి దనుజేశుఁ బట్టభద్రునిఁ జేసె మంత్రులతో
వనచరు లలరి రినజుఁ డాలింగనము చేసి విభీషణా రావణవధకు తోడు గమ్మని ప-
ల్కిన కీర్తిసాంద్రుఁడగు శేషగిరీంద్రుని సేవ యొనరింతమనె ॥కామలీలా॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi