కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
యుద్ధకాండము-09
ప్రథమయుద్ధారంభము
రాగం: నాట - తాళం: జంపె
పల్లవి:
గౌరీ వచోజితశారీ విను శ్రీమీఱి ॥గౌరీ॥
అనుపల్లవి:
శూరులై యనికి దివిజారు లేఁగుచో రణ-
భేరీమృదంగముల్‌ పృథులశంఖారవముల్‌
వారక మ్రోయించి మహిషఖరహరికరి వాహనముల నారోహించి ఘన-
వైరిభయద కరవాలగదాశూలభిండివాలచాపములు ధరించి యాయతంబైరి ॥గౌరీ॥
చరణములు:
అటకు మున్నే రాఘవాజ్ఞచే వానరుల్‌
పటు ఘోషభీషణ స్ఫుటశౌర్యులై మహా-
విటపముల్‌ బలుగిరుల్‌ బెకలించికొని వచ్చి
కుటిల రావణబలము గూలు రాముఁడు గెల్చుఁ
జటుల జయమొందు లక్ష్మణుఁ డినజుఁ డరినోర్చు
నీటుజూడుఁ డటంచుఁ దలపడి రరులతో సేపు మీఱి కరణ మొనరించు నా-
ర్భటుల హనుమదంగద నీలకుముద శరభ నల జాంబవత్సుషేణాది యోధవరులు ॥గౌరీ॥
లంక వాకిళ్ళాని లావుమై కపులు ని-
శ్శంక నసురుల నఖాస్త్రముల విదళించఁగా
బింకములు దనుజు లెమ్మెయిఁ బల్కి నలిరేగి
పొంకమౌ పురద్వారముల వెడలి యసి తోమ-
రాంకుశ కరాళిచే నగచరుల గీలించి
ఱంకెలు వైవఁ గని ప్లవగు లహితుల బీరంబడంచి రాజితస్థలిని బహు-
పంకమై మేదోమాంసరాశి నెత్తురువంకలై పఱచె మహాద్భుతముగ నయ్యెడను ॥గౌరీ॥
మరలి దితిజుల కరుల హరులఁ దేరుల సతి
త్వరగఁ బురికొల్పి సంగరకేళి సల్పిర-
త్తరి వనేచరులు నట్లనఁ బేర్చిరి జయేచ్ఛన్‌
తరుచరుల్‌ రామభద్రదయార్ద్రదృష్టిచే
నెరపుబలమును గల్గి వెలసి రమృతముఁ గొనిన
సురలవలె రావణాసురుఁ డల సీతాచోరుఁడైన పాపమువలన నిశి-
చరులు దొరలు దరలి రిల జతుర్థాంశశేషసైన్యములు బఱచె భయదృతంబులయి కలఁగి ॥గౌరీ॥
తన బలములిట్లౌటఁ గని కనత్కోపుఁడై
ఘనుఁడింద్రజిత్తు మేఘములలో డాఁగి క్ర-
న్నన శితాశుగ వితానము లోలి వర్షించెన్‌
వనజసంభవుని వరమునఁ గన్న బ్రహ్మాస్త్ర-
మున మర్కటానీకముల నెల్లఁ బడనేసె
నినకులమణి కోదండదీక్షాగురుఁడయ్యును బ్రహ్మాస్త్రమును మన్నించి తత్‌-
క్షణమూరక యుండి స్వబలములు గూలుటరసి
యనలసన్నిభ జ్వలద్భయదనేత్రుఁడయ్యె ॥గౌరీ॥
ధనువుఁ దే లక్ష్మణా దనుజు భస్మీకరింతును బ్రహ్మసాయకం-
బునఁ జూడు నా బలంబన శేషాద్రిపతి బల్కిన వాఁడు జన నంత
వనచరులు పడుటఁ గనుఁగొని రాముఁడడలి యో
హనుమంత క్షీరాబ్ధి కావల దివ్యౌషధిజనకమగు ద్రోణనామగిరి గలదది వేఁ
గొనివచ్చి కపులఁ బ్రోవుమనఁ బావని జవమునఁ జని తెచ్చి
వనౌకసుల సజీవనులఁ జేసి నగము మున్పటిచో నిడి వచ్చె ॥గౌరీ॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi