యుద్ధకాండము-15
రాగం: హుసేని - తాళం: అట
పల్లవి:
మాంగల్యమూర్తి లసమానకీర్తి హృతాంగజార్తి వినవె ॥మాంగల్య॥
అనుపల్లవి:
ఉ|ప్పొంగి రామభూజాని ప్లవంగపుంగవులతోడ నప్పుడు విభీషణోపాయ
సంగతుఁడై పోరికిం గడగె నంగదాదులు
తుంగగిరిశృంగతరుధరులై సింగముల భంగిని జెలంగిరి ॥మాంగల్య॥
చరణములు:
రావణుఁడు కొలువులో వసించి రాక్షసావళిన్ గాంచి యనె రాముఁడు నరుఁడా
భావింప మదిని నారాయణదేవుఁడు విధి నిర్ణయమతనిచే
చావు నాకిది నిశ్చయ మిందుకై వగవఁ దుదిని విన ననరణ్యుఁడన్
భూవిభుఁడు నను దిట్టె మావంశజుఁడై హరి నిను
నీవారిఁ జంపునని పూనెఁ గావలయు పనిగాక కుంభకర్ణు ని-
ద్రావశుఁ దోడితెండని పంప భటులేఁగి
వేవిధముల బోధ గావింప మేలుకొని సురఁ-
ద్రావి భుజియించి చని సభ నగ్రజు పదములకు మ్రొక్కె ననుజుఁడు ॥మాంగల్య॥
ఆదరించి తొడమీఁద నిడుకొని యా దశగ్రీవుఁడనియెఁ దమ్ముఁడా
పోఁద్రోయరాని వెత వచ్చె నింకేది గతి దీనికి యనిలోఁ గ్ర-
వ్యాదజనిత నిర్మూలనమాయె నీదు కృపాణిచేఁగాని రా-
మాది శత్రుల గర్వ మడగదనిన నవ్వి యతఁడన్నను గన్గొని ము-
న్నే తెల్పలేదా దీన చేటగునని సీతాదయిత సాక్షాన్నారాయణుఁడు ఈ
వాదులేల నారదమౌని యొకనాటి నిశి గిరి-
మీద నేనున్నతఱి రా నమ్రుఁడనై యుదంత మడిగితిననె ॥మాంగల్య॥
దేవతలు మీచేవఁ జెడిపోయి రావణకుంభకర్ణాసురుల చెట్ట మీ-
తో విన్నవింప వచ్చితిమన శ్రీదేవుఁ డనుకంపమతి వెఱమాన్చి
వేవే నిలింపావనుఁడై పరమపావన రఘుకులో-
ద్భవుఁడయ్యెనని సురముని పనివినె గణుతింప రా-
మావతారసహస్రాంశ సమమా హరిలీలావతారము లెవ్వియైన రాముఁడు శివుఁడు
నీవు రాముని భక్తి సేవింపు మెవ్వ-
రా విభు భావింతు రనఘులై వారవ్యయసుఖముఁ గాంతురనె దైత్యుఁడు ॥మాంగల్య॥
కుంభకర్ణు వాగ్దంభము విని యారక్తాంభోజము క్రియ ముఖమొప్పఁగ
జంభాహితారాతి నిను రణవిస్రంభముకై రావించితి గాన
రంభము మేరా రాఘవాస్త్రశుంభత్ప్రహారహతి నేచి వి-
జృంభించలేవు నిద్రించఁగఁ బొమ్ము తండ్రీయనె నౌరౌరా దు-
ర్లంభితశాలతా బంధరుఁ డితఁడని నీలాంభోధరము వలె మేనమరఁ గోట దాఁటి ది-
క్కుంభికరదృగ్దోస్తంభవిన్యస్త నిస్తుల-
దంభోళి సమధికగదావష్టంభుఁడై వెడలె ఘటకర్ణుఁడు ॥మాంగల్య॥
పౌలస్త్యుఁ డబ్ధి యుల్లోలముగ నార్చి యాలమునఁ గపుల కీలెడలించి జము-
పోలిక రాఁగా నన్నక్కు మ్రొక్కి లీల నను రాగావహదృష్టి నను
బాలింపు వేగ విభీషణుఁడ మేలెంచి బాగా బోధించితి
నే లంకేంద్రుని జగన్నేత రాముఁడు సీతనిమ్మతనికనిన
నాలోఁగాఁ గరవాలమెత్తి చంపఁగణగి నన్నుఁ
బోఁదోలె రాముని చరణతోయజముల్ చేరితి
నాలసన్ముఖుఁడై యతం డతని గౌఁగిలించెను
శ్రీలనొంది చిరంజీవివయి శేషగిరిపతి దయ మనుమనెను ॥మాంగల్య॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi