యుద్ధకాండము-16
రాగం: మధ్యమావతి - తాళం: ఆది
పల్లవి:
సారవచనరచనావిశారద క్రూరదానవఖండనవిశారదా ॥సార॥
అనుపల్లవి:
ధీరుఁడై కుంభకర్ణుఁ డనుజుని నూఱడించి మదించి యుండుట
వైరుఁ డాప్తుఁడని తెలియదని సమదవారణమువలె మారెఁ గపులను ॥సార॥
చరణములు:
దండిమగల నగలించఁ గని కోదండ మెక్కిడి యఖండాశుగములు
చండభానుకులుండు దనుజవరు గండడంచి మించి
నిండుకోపమున ననలాస్త్రమున ఖండించెను వాని వలకేల్
మెండుగా దానిక్రింద నగచరులు బెండాబెడసరై పడిరి విను ॥సార॥
పెరిగిన పగచే సాలవృక్షము బెఱికికొని నృకేసరి కెదురై వాఁ-
డెదురుగా నరుదేరఁ గని రామధరణీపతి చెంగలువ
సరము బాగొనరు తూపులఁ జూపి పఱపు బాహువు నరికె నైంద్రమున
బరువుతో రా నసుర కాళ్లు ద్రుంచె భల్లె యననేల పిల్లతూపుల ॥సార॥
దొర్లిదొర్లి బడబాముఖము క్రియ దొడరి నోరు దెఱచి చంద్రుని మ్రింగ
దర్లు రాహువుమాడ్కి రామ నే దార్లు గని యుప్పొంగ
దీర్లువా యెల్ల నిలిచి తల యిలఁ ద్రెళ్లనేసెను రాముఁ డైంద్రమున
బొర్లిగింతలిడి పడెడి శిరము లంక భోరనఁ దనువు నీరధిఁ బడెను ॥సార॥
లంకగోపురముఁ గూలెం దలతోఁ బొంకమేది జలధి తిమింగిలాది
సంకులంబయి తనువుఁ బడి చదిసె జంతుకోటి వెలది
జంకుదీఱి నుతించి విరులజడి పొంకముగ సురలు గురిసిరి అరుణ-
పంకజాతనేత్రుని ధనుర్బాణపాణియగు కోదండరాముని ॥సార॥
రాముని గనుఁగొన దేవమునివరు లాముకొన్న ప్రేమ నేఁగుదెంచిరి
ధామముచే దిశలు వెలుఁగ నుతించె దైవతముని హరిని
రామచంద్రుని గురుని కువలయశ్యామసుందరశరీరుని దయా-
సామదృక్శమిత నిజాశ్రితార్తిని లామిని శేషశైలాధిపుని ॥సార॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi