యుద్ధకాండము-22
రాగం: నాదనామక్రియ - తాళం: ఆది
పల్లవి:
వినవే ఘనవేదాంతవనపాలికా దివ్యమణిమాలికా బాలికా ॥వినవే॥
అనుపల్లవి:
దనుజాగ్రణి యనేక దానవానీకముల
తనచుట్టు కావలుంచి హర్షించి
మొలసి పాతాళగుహ ననలుని బ్రతిష్ఠించు-
మనుచు గురుసూక్తి హోమము సేయగాఁ దొడఁగె ॥వినవే॥
చరణములు:
ధూమసంతతి భూనభోమండలము నిండ
శ్రీమన్నృపాలతిలక అభిచార-
హోమమిది యనుచు బలుక విభీషణుఁడు
ప్రేమఁ గొనియాడఁ బంపెను హనుమదాదులను
శ్రీమీఱ నంగదునితో త్వరతో
రామవిభునికి మ్రొక్కి లంకకోటలు దాఁటి
వేమాఱు వానరులు వెదకిరి దశాననుని ॥వినవే॥
సరమ యను చెలి విభీషణుని పత్ని యతఁడున్న
తెఱఁగు చేసన్నఁ జూప గుహవాతి
మఱుగుశిల మరుగు బాపగఁ గపులు వడిఁ
జొఱఁబడి మహామౌనధరుఁడైన రావణుని
శిరములు గలగ గుదియల మోద చల-
మఱి యచలుఁడై యున్నతరిని మండోదరిని
కురులు బట్టీడ్చేడ్వఁ గొనివచ్చె నంగదుఁడు ॥వినవే॥
రైకముడి వీడెఁ జీరయుఁ బోకముడి వీడె
శ్రీకరంబగు మొగంబు చెలువెడలె
నా కుమారరత్నంబు లేమి నిటు
చేకూడెననె కాకలీకలరవ
కోకిలకంఠముగ నడలెను బడలెను
యీ కష్టునకు లేదు యింతైన సిగ్గు యిక
రాకొమరుచేఁ జావరాదే యని పొగలె ॥వినవే॥
వాలుగొని లేచి సతి వదలుమని యసురపతి
వాలికొడుకును వ్రేసెను హోమవిధి
చాలించి మది రోసెను కపులు చని
రాలోలనయనను లాలనముఁ జేసి వగ-
పేల దైవాధీనము యీ జగము
బాల జ్ఞానావలంబనమొందు మజ్ఞాన-
మూలంబు దుఃఖమోహము లహమ్మతియు ననెను ॥వినవే॥
దేహాద్యనాత్మలందీ యహంబుద్ధి వల-
దీహసంసృతి మూలము అజ్ఞాన-
దోహలము లింద్రజాలము ఇదిచాలు
సోహమనవలె నాత్మ శుద్ధుఁ డజరుఁడు మమ-
త్వాహంకృతివిరహితుఁడు సాక్షితఁడు
దేహేంద్రియప్రాణ ధీకాల కర్మస-
న్మోహాదులకు ద్వంద్వాదులకుననె దశముఖుఁడు ॥వినవే॥
నేను రాఘవుల ననిలో నణచివత్తు నిటు
రానేరకున్నఁ జత్తు ముక్తియను ని-
ధానంబు జూరఁబుత్తు యెటులైన
గాని మ్మవల సీత ఖడ్గమునఁ దునిమి నీ
మేనగ్ని వేయవే నను డాయవే
నా నాతినాథ జగన్నాయకుఁ డతని గెల్వ-
గా నీకు గాదన్యగణదుర్జయుండనెను ॥వినవే॥
మును మత్స్యకూర్మకిటి మనుజమృగవామన ధ-
రణిదేవతారూపమై నా సామి
మనువంశభూపాలక నిలింపరాజ పితృ-
గణముల సముద్ధరించెను ఇపుడిలను
నినకులమున శ్రీ రాముఁ-
డనఁ బుట్టె నిను జంప
మొనసి పరుఁడు ప్రధానపురుషేశ్వరుండనెను ॥వినవే॥
అరసి నృహరికి సీత నర్పించి తమ్మునికి
దొరతనంబిచ్చి మునివై యడవిలోఁ
దిరుగుమిక సుగుణఖనివై యని పలుక
తరుణి తేలేదజ్ఞతను సీత లక్ష్మి శ్రీ-
హరి రాముఁడగు నతనిచేఁ జచ్చి చె-
చ్చెర నైక్యమొంద నిటు చేసితిని శేషగిరి-
వరుని గురిగంటివని వచ్చె సభకల సురారి ॥వినవే॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi