యుద్ధకాండము-23
రాగం: కేదారగౌళ - తాళం: ఆది
పల్లవి:
రతిసంవీజ్యమాన సుచామరాలోలనీలాలకా వినవే ॥రతి॥
అనుపల్లవి:
చతురఫణితి నతావగుణజాలకా
అతిక్రోధనులు దివ్యసాధను లగ్నివర్ణ వృశ్చిక సర్పరోము
లతులబలులు ఖడ్గరోమాది వీరాగ్రేసరులు రణజితారులు
కుతుకముతోఁ దేరుల్ మదగజ ఘోటక ఖరముల స్వారుల్ తన-
ర రతనచుట్టుమతము బిట్టుఁ జూపుచు రా రావణుఁడు శ్రీరాజిలెను ॥రతి॥
చరణములు:
మణికిరీటమకరకుండలము లరుణకిరణరుచి మీఱఁగా
ఘనచిరత్న రత్నఖచితమగు పతక మురము నందొరయఁగా
తన యెదన్ వేల్పుటేనుఁగు దంతము తగుతొడవయ్యును గెలుపు దిశాంతము-
లను చాటునీటు దోఁప నన్యులు భలారె యితఁడు బలారివైభవుఁ
డనుచుఁ బలుకఁగ దశాననుఁ డాహవకేళి కడరె ద్రిదశావళి
దలుకఁ డాకాల గండపెండేరము దాల్చి బిరుదై మేల్చిరాకున ॥రతి॥
ధాణధణమనెడి భేరీరవము తవిలి భువిని దివిని నిండా
నాణెమగు వాహనముల ద్రిప్పు విన్నాణము కోర్కి పండ
బాణతూణకృపాణాదు లిరువది కరములు నిరవై తనరె నెర
నాణిముత్యపుసరు లఱుత మెఱయ బ్రవీణత ననికి వెల్వడె సఖీ
జాణ యగుట గాంచి హరి విభీషణుని మాటలాలించి యీ
పోణిమెచ్చటఁ గానమని తలయూఁచి పొంగారు బంగారు విల్గొనె ॥రతి॥
వీణె మీటిన సూటిగా మౌర్వి టంకృతిఁ జేసి
తూణయుగళి వెడలు పొరలు శరాళి మెరయఁగ కేలఁదీసి
పాణిలాఘవము రణపటిష్ఠత బరులు మెచ్చఁ జేతునను యిచ్చఁ గపి-
శ్రేణిలో నలరెఁ జుక్కలలో ఱేఱేని వడువున శ్రీనివాసుఁడు
జాణతన మయారె భళి మజ్ఝారె యని జగతివారెల్లను
వాని నుతించిరి శేషాద్రిపతి పురాణపురుషుఁడనె నయమెఱిగి ॥రతి॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi