యుద్ధకాండము-25
రాగం: రేగుప్తి - తాళం: ఆది
పల్లవి:
కౌమారి రామరావణుల సంగ్రామనిపుణతలు విను శ్రీమీఱి ॥కౌమారి॥
అనుపల్లవి:
సామజరవముల్ వశానిమిత్త సామర్షములై పరస్పరంబు
దీమసంబున గెలన్ గలఁగు క్రియన్ భీమవిక్రమములం దలపడిరి
హైమపుంఖ కంకపత్ర సితసాయకసహస్రములు మహామహులై
సాముఁజేసి యేసిరెంచి నుతించఁ దామరసగర్భున కలవి గాదనఁగ ॥కౌమారి॥
చరణములు:
ఆగత పునరాగతాసమ సమయోగప్రయోగకృతప్రకృతులయి
యాఁగి యొక్కరి నొకరి హుంకరించిరి ఏఁగి మార్కొనిరి తొలుత స-
ఖి గరిమ ధనుర్జ్యాలతాటంకృతుల్ భూనభోంతరంబు నిండఁ-
గా గుణింపుచు గురుల్ దప్పక కళాగురుత్వముల బల్ బొదలికల
బాగుగను శిలీముఖము లలవు మయిఁ బరపి పరాక్రమముల సింహములో
నాగఁ బోరిరనిని జేరి యా మానవ దనుజనాథమణులు ఘనాకృతులు ॥కౌమారి॥
వింటను దశవదనుఁడు పదిట పండ్రెంట నిరువదింటఁ గడున్ వడినేయ
నంటి వానినన్నింటి తూపుల బో గెంటినో నేసె రామవిభుఁడు సుర-
కంటకు నపుడా జ్యాహుతి ననలు కైవడి నతఁ డాగ్రహించి యేఁబ-
దింట నొంట నూటన్ గనలి పవివంటి యంబు వాటంబుగను మి-
న్నంటి కవాటబన పరఁగు వాని యురము లక్షించి యిలాధిపుఁ డద-
రంటనేయ నల్ల మాయలరావణాసురుఁడు సోలి తెలిసెను సొక్కునను ॥కౌమారి॥
మాతలి తెచ్చిన హరిస్యందనము నాతఱి నెక్కి నృహరి సకోదం-
డాతతశరుఁడై జ్యారవమున బ్రహ్మాండము నిండ మోహరించెను
చాతురి నసురాధీశుఁడున్ సచేతనుఁడై రామాధిపు నెదిరి
జాతరూప రత్నాంచితబాణరాతముం బ్రయత్నంబుగ నేసె
సీతాపతి మేరుస్థిరధృతియై శ్రీమతియై సుకృతియై తనవి
ఖ్యాతి హెచ్చనంత నెచ్చరించితి వనాటు లలర యసురు లదరఁ బేర్చె ॥కౌమారి॥
రావణుఁ డనలాస్త్రము నేయ శ్రీరాఘవు డనలాస్త్రముననె మాన్చె
దైవముననే దైవాస్త్రము మరల్చె దైవతనృపవతంసము అస్త్ర-
కోవిదుఁడై రాక్షసరాజు కాకోదర క్రూరాస్త్రముఁ బరగింప
దావశిఖాముఖముల్ భుజగములు రా వెడంద నఖముల్ గల గరుడా-
ఖ్యావసుపుంఖాస్త్రము పుంరత్నం బరసి బ్రయోగించె జయోన్నతియై
యా విహంగమాస్త్రలింగాభంగాంబకము లయ్యహిశరములఁ ద్రుంచె ॥కౌమారి॥
నాగాస్త్రము ప్రతిహతంబయిన బాణము లడంరించెను శతంబు సహస్ర-
మా గురుభుజుపై లంకేంద్రుఁడొకట హరిసారథి నొంచి యతంద్రితుఁ-
డై గననై నాశక్రకేతువు నవనిం బడఁగ నాక్షణమున నేసి
శ్రీగరుచ్చరములఁ బూన్చి ప్రహరించె వాహనముల నైంద్రమున
మూఁగిన సురఖేచరవరాప్సరోమునులు విభీషణుఁడును భీతిలి రు-
గ్రాగచరులు యూధవరులు మైనాకాద్రి యనఁగా దశముఖుఁడు గర్జించె ॥కౌమారి॥
నిటలతట భ్రుకుటియై కన్గవఁ గన్నీరు కెంజాయకుటీకయో యనఁ
బటుతరక్రోధాగ్ని నసుర కాలిపడుననఁ గని నృపకిరీటి విలు
దిటవుగఁ గొని టంకారము జేసి చటులశరముల లంకాపతి నేసి యు-
దుటున గండడంచి కపులకు సంతోషము గావించి యాక్రమించి
కుటిలాత్మకు నుడుకార్పఁగను జగద్గురు కోపంబొదవ ప్రతాపంబునఁ
బటిమ నంతకుండనం దగెను హరి పరుసున జరాచరములు నెఱా బెదరె ॥కౌమారి॥
పుడమి గడగడ వడకె రావణున కెడద భయంబు దొఁడఁగె గుపితుఁడగు
పుడమిఱేనికా నిశాటేంద్రునికి పోర నుపమమయ్యె నిఁకెట్లొకో
గడుసిది యనుచు సురల్ విమానాగ్రములనుండి కిన్నరుల్ గనుంగొని
కడక రెండురూపులు దాల్చెననఁగా ధృతశరచాపులు దలపడి
యుడుగక సప్తాహోరాత్రములు సమున్నతి నొండొరువుల నొంచుచు వా-
రడరి రందు రఘుకులేంద్రుఁడగు శేషాచలపతి ప్రబలె సుకృతి యగుచు ॥కౌమారి॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi