యుద్ధకాండము-29
రాగం: ఆహిరి - తాళం: ఆది
పల్లవి:
వినవే హేమదుర్గా స్వర్గాపవర్గ ॥వినవే॥
అనుపల్లవి:
ఇనవంశమౌళి విభీషణుతో నినజానిలజాదులతో మీతో-
డునను నే జయము శ్రీయును గొంటి ననుపమమీ కథ జగతి వాక్రువ్వుఁడనె ॥వినవే॥
చరణములు:
కురులు జీరాడఁ గుంకుమరేఖ గరఁగ మోము వాడ వగతోడ
మెఱుగుకన్నుల నీరు నెరిజడితో నీరాడ
నురువులయిన బిగిగుబ్బల బరువుచేఁ గౌ నసియాడ
సరులు రాల మందోదరి మొదల్ సకియల్ వచ్చిరి హా రవంబునను ॥వినవే॥
హా నాథ హా రావణ హా రణశూరా హా లోకవిద్రావణా జితైరావణా
దీనులమగు మము దేర్పఁగదే రమణ
దానవేంద్రాగ్నిహోత్రుని భూనాయకపర్జన్యుఁడార్చెనా
నేను రామునికి సీత నిమ్మని నిను దెల్పిన వినవైతివనెను మయసుత ॥వినవే॥
అన్నా యాపద్దు రామునితో వలదన్నా యెంత రద్దుచేసితి
వన్నా మిన్నా సింగముఁ గాలదన్ను టేటిహద్దు
పిన్నపెద్దల్ వద్దువద్దు అన్నా పని నేమిఫలము కద్దు
నిన్నువంటి నెఱసాహసికు లిలనున్నారే యని విభీషణుఁడడలెను ॥వినవే॥
స్వామి లక్ష్మణునిఁ గని యీవిభీషణు బోధింపుమని పల్కిన విని
తా మైత్రిఁ జేరి పరితపించెదవు సఖుఁడ నీ-
వీ మెయి నీతఁడు నీకెవ్వఁడు ఇతనికి నీవెవ్వఁడ వేమిపని
భూమి నిసుక నదివేగమున జను పోల్కి జను మృతులు దైవమాయ ననె ॥వినవే॥
నేను నీవనుటెల్ల భ్రాంతి మేనుల మేనుల్ దేహివల్ల దేహియౌ నెల్ల
మానాభిమానావమానములు కల్ల
తాను జ్ఞానానంద బ్రహ్మమే ననకున్నవానికి ముక్తి యిల్ల
యీ నయంబుగ సౌఖ్యమొంది సమిద్ధతేజమున బయల్ సేయుమనె హరి ॥వినవే॥
కృపదెల్పు రామానుజుని నుడి నడల్ దేరి యిష్టుఁడు రాఘవు నడుగుల్ వలగొనినపుడె
నిపుణ మీయన్న యపాపుఁడను రాముని
యుపమ మెచ్చి యంతఃపుర చపలాక్షుల నూరార్చి యగ్రజుని
అపరిమితము దనుజుల్ బూనిరా నందలమున నిడుకొని చనె విభీషణుఁడు ॥వినవే॥
వేదవేత్తలతో నాహితాగ్నిసంవిధానముగాను బరలోకవిధుల
వేదోక్తముగ నన్నకు విభీషణుఁడు సలిపెను
వేదవేద్యుఁడగు శేషగిరిశ్రీవేంకటరామేంద్రునకు మ్రొక్కిన
సాదర ప్రియాలింగనము హరి యొసంగెఁ జిరంజీవ సుఖీభవ యటంచు ॥వినవే॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi