కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
యుద్ధకాండము-40
రాగం: కన్నడ - తాళం: అట
పల్లవి:
ఆయతజగత్కార్యా భుషాయితచంద్రసూర్య ఆర్య విన ॥ఆయత॥
అనుపల్లవి:
ఆయెడ గౌసలేయుఁ గాంచి కైకేయికొడుకు విధేయుఁడై సామీ జాగేమి
యీ యఖిలరాజ్యము భరింపుమీ పట్టభద్రుఁడవై
హాయిగా మము ప్రజలనేలు మీనాఁడు దశరథుచే
మాయమ్మ జేకొనిన సిరి నేమముఁ జేసి నాఁడు నాకొసంగిన
ఛాయ నేనిప్పుడు నీకొసఁగితి సాష్టాంగవినతి చేకొనుమనె రాఘవుని ॥ఆయత॥
చరణములు:
అత్తఱి వసిష్ఠు తథాస్తనెను చిత్తమురాఁ బినతల్లి భాషించెను
ఉత్తముఁడౌ రఘుసత్తముఁడు భరతోక్తి సిరిఁ జేకొనెను
హత్తినమాయ పొత్తున మనుజ తనువెత్తుటను సుఖచితారక రూపమై సానుభవమై
సత్తయిన పరమాత్మకు వింతా సర్వభువనస్రష్టయగు నీశ్వరునకిది యెంత జంత శ్రీకాంత
విత్తమగు నెవ్వని బొమముడిని విశ్వము నశించు నెవ్వని దయ
క్రొత్తగా జగము విలసించును కొన్ని లీలలను వర్తించునటంచు నతఁ ॥డాయత॥
ఆవలశత్రుఘ్నుని యానతిన్‌ కేవలభక్తియని వారలు నియతిన్‌
శ్రీవరదుని మీసమును జికిలిఁజేయ శృంగారాకృతిన్‌ శుచిస్నాతు-
లై విభాకరవంశాగ్రణులు శోధితజటావళులై శోభనస్నానమునఁ
బావనులునై చతురలంకృతులయి శ్రీరామలక్షణ భరతశత్రుఘ్నులు సారమతులయి అలరిరి సుమంత్రుఁడు
సావధానమున గైసేసి స్యందనము దెచ్చి మీరెక్కుడి
దేవ యని విన్నపమొనర్చిన దివ్యమగు తేరెక్కెఁ జక్కని రామవిభుఁ ॥డాయత॥
తెల్లనిగొడుగును బట్టె శత్రుఘ్నుఁడు మెల్లగ విసరెఁ జామరము లక్ష్మణుఁడు
వల్లభ రథ్యముల కందములు దట్టి వాగెలందె భరతుఁడు
బల్లిదులై కపులెల్ల గుఱ్ఱముల నెక్కి సుందర మనుజాకృతులయి రాగానుమోదముతోను
మొల్లముగ మంత్రివర సరయుపీతాంబరమణిభూషణ ప్రభలచే నుజ్వలులయి ప్లవగ దానవకుల
తల్లజులు తపనజవిభీషణు లుల్లసద్ద్విపముల నెక్కి విలసిల్లిరి యయోధ్యఁ జేరం జని
రల్లిబిల్లిగ ప్రజలు గనుగొని హరిని ॥నాయత॥
నాతులు సీతను శృంగారించి నూతనరత్నాందోళికమున నుంచి
ఖ్యాతిగను సుగ్రీవునిపత్ను లందలముల నారోహించి
చాతురిని రాగా తౌర్యత్రిక నినాదము మధురమై తోడ్తోనెసగా యింపొసగా ద్వి-
జాతిముఖ్యులు నైగమోక్తులను నాశీర్వదింపఁ బ్రశస్తముగ సకలవైభవములను ప్రవేశమైరి
పురిజాత కౌతూహలమున రామచంద్రోదయము గని యుప్పొంగి
స్త్రీతరుణబాలవృద్ధాఖిల చేతనాంబుధి మించి గాంచి వరించినది ॥ఆయత॥
రాముని దూర్వాదళశ్యాముని హైమమణికిరీటాభిరాముని
కామకోటిశృంగారధాముని కల్పకదాముని సామి నరుణ-
తామరస నేత్రాంచలములవాని శ్రీమణిమయాంగదహార కలనూపుర
శ్రీమహిత నవరత్నకటిసూత్రాంచన్మధ్యుఁ గాంచనచేలుని చలత్కుండలశ్రోత్రద్వయు సరసకస్తూ-
రీమలయజవిలిప్తగాత్రుని శ్రితహితుని శేషాచలపతిని భామినులు మేడల నొనరఁ గని-
రా మహిమ యేమందు ముందునెందు గన ॥నాయత॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi