కీర్తనలు శ్యామా శాస్త్రి కామాక్షి నీ పదయుగము (స్వరజతి)
యదుకులకాంభోజి - త్రిపుట ( - మిశ్ర చాపు)
పల్లవి:
కామాక్షి నీ పదయుగము స్థిరమని నే
నమ్మియున్నాను నా చింతలెల్లను దీర్చమ్మ॥
స్వరము(లు):
అంబ నను బ్రోవ సమయము వినుమా పతితపావనిగ॥
అనుదినము శరణమని నిన్ను వేడుకొనియున్న సుతుడమ్మ సదయ॥
సరసిజాసన హరీశవినుతపాదా నాతో వాదా?
కమలదళసమనయన కచజితఘనా శశిధర నిభవదన॥
మానవతి నిను సదా దలచిన మానవులకెల్ల ఫలమొసగే
బిరుదుగల దేవతయని నే వినబడి నీవే గతియనుచు॥
పావని పురహరుని రమణీ పార్వతి సకల జనని
పాతకములను వడిగా దీర్చి వరమొసగుము॥
కనకగిరి సదన నిను గొలిచిన జనములకు దినదినము శుభమొసగే
వని శృతులు మొఱలిడగా మొఱలు విని విని విని॥
బాలకిసలయ చరణ నిమిషము తాళనిక విని మదగజగమన
తామసము సేయకనే నన్నిపుడు బ్రోవుము పరాత్పరి॥
కుందముకుళరదా సురబృందవినుతపదా భువిలో
వరదాయకిగదా నా మొఱలు చెవులకు వినదా గిరిసుత॥
నీవలెనే గలదా నెఱదాతవు ఈ జగతిలో నీదు
పదసారసముల ఈ భవజలధికి తరియనుచు మిగుల॥
కమలసంభవ సురమునీంద్రుల చేతను నిను పొగడుటకు
తరమమ్మ శుభమిమ్మ నినునమ్మితిని
శ్యామకృష్ణసోదరి దురముగను కరుణ సలుపుమికను॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - kAmAkShi nI padayugamu (svarajati)