కీర్తనలు శ్యామా శాస్త్రి రావే హిమగిరికుమారి కంచికామాక్షి వర (స్వరజతి)
తోడి - ఆది
పల్లవి:
రావే హిమగిరికుమారి కంచికామాక్షి వర
దా మనవి వినవమ్మ శుభమిమ్మా మాయమ్మ॥
స్వరము(లు):
నతజన పరిపాలిని వనుచు నమ్మితిని సదా బ్రోవ।
మదమత్త మహిషదానవమర్దని వెతదీర్చవే దురముగను।
కామపాలిని నీవే గతియని కోరితి కొనియాడితి వేడితి।
కామితార్థఫలదాయకి యనేటి బిరుదు మహిలో నీకే తగు।
కమలముఖి దరగళ ఘననీలకచ భరా మృగవిలోచన మణిరదనా
గజగమనా మదిలో నిను సదా దలచుకొని నీ ధ్యానమే తల్లి।
శ్యామకృష్ణనుత విను నాచింతను వేవేగ దీర్చి అభయమియ్యవె
కల్యాణి కంచికామాక్షి నీ పాదమే దిక్కు॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - rAvE himagirikumAri kaMchikAmAkShi vara (svarajati)