| కీర్తనలు | తూము నరసింహదాసు | భజనఁజేసే విధము తెలియండి - జనులార మీరు |
| సౌరాష్ట్ర - రూపక (ఆట) |
| పల్లవి: |
| భజనఁజేసే విధము తెలియండి - జనులార మీరు నిజము గనుగొని మోదమందండి |
| అనుపల్లవి: |
| భజనఁజేసే విధము దెలియక - నిజముగా హరిభక్తులనుకొని మద గజముఁ దెగవ్రేయలేకయు - సుజనులని తిరుగంగ నేలను |
| చరణము(లు): |
| వారు వీరని యెంచబోకండి - నరులార మీరు నోరు చచ్చినవారు కాకండి వారు వీరని యెంచుటెల్లను సారము లేనట్టి హీనత పౌరుషులకే గాక పుణ్య ధారి కథలం దేమి యున్నది? |
| జ్ఞాను లనుకొని యెగసి పడకండి - జనులార తత్త్వ జ్ఞానమందే మనసు నిలపండి జ్ఞాను లనుకొని యెగసిపడి య జ్ఞానములు పైఁ బెట్టుకొనినను మానసంబునఁ బుట్టి చచ్చియుఁ బూని మరి జన్మింప వలయును |
| ఝూట మాటలాడఁ బోకండి - నరులార కలియుగ నాటకములోఁ జిక్కబోకండి ఝూట మాటలాడి పొట్ట కూటికి వేషములు దాల్చుక మాటికి యమబాధలచేఁ గాటికి బోవంగ నేటికి |
| మూలస్థానముఁ దెలిసి బ్రతుకండి - జనులార మీరు మేలిమిగ శ్రీహరిని వెదకండి మూలస్థానముఁ దెలిసి మీలో జాలగా వెలిగేటి జ్యోతిలో లీలమై వెలుగొందు బాలుని నీలమధ్యమునందు దలచుక |
| ధరను శ్రీనరహరిని గొలువండి - జనులార మీరు పరమపదవిని బొందగోరండి ధరను శ్రీఘటికాద్రి నరహరి పరమభక్తవరుల మనుకొని విరివిగా నరసింహదాసుని వరకవిత్వము సార మనుకొని |