కీర్తనలు తూము నరసింహదాసు ఇంకా సంసారముతోఁ బొందేలా - శ్రీరాముని దలచక
సౌరాష్ట్ర - ఆది
పల్లవి:
ఇంకా సంసారముతోఁ బొందేలా - శ్రీరాముని దలచక
అనుపల్లవి:
ఇంకా సంసృతి పంకములో యమ
కింకరులకు బహుకొంకుల దలచితి
చరణము(లు):
దారపుత్రులు తల్లిదండ్రులును
రారు నీకు మఱి దారి చూపుటకు
ధనముకై తన తను వమ్మియు మది
ఘనదుఃఖములను గాంచి యలసితిమి
నేటివఱకు బహుకోటి జన్మములు
సూటి దప్పి పరిపాటి గాంచితిమి
బంధుజనమ్ముల బంధకములఁ బడి
దంధనమున మదిఁ దలపక చెడితిమి
లోకవార్తలకు లోనై తిరిగి వి
వేకము మరచితి వీకతనమ్మున
దొరలకు దొరయై ధరణిజపతియై
మెఱసిన శ్రీరఘువరునిఁ గొల్వకను
వాసిగ భద్రగిరీశుఁడు నరసింహ
దాసుని బ్రోవను దయ గలిగున్నా
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - iMkaa saMsaaramutoo.r boMdeelaa - shriiraamuni dalachaka - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )