కీర్తనలు తూము నరసింహదాసు ఇంచుకైన నభిమానము లేదా యిది సమయము గాదా
పున్నాగవరాళి - చాపు
పల్లవి:
ఇంచుకైన నభిమానము లేదా యిది సమయము గాదా
కొంచెపు జనులిటు వంచనసేయ సహించియుండుట వాదా, రామ
చరణము(లు):
పంచశరుని గన్న పరమపురుష నీదు ప్రాపు నమ్మినజనుల
వంచనఁ జేసినఁ గొంచె మెవ్వారిదో
యెంచి చూడగరాదా, మర్యాద
ఉదరపోషణకు నీవిధముల జనుల నే నొదిగి వేడవలెనా
సదయమతివి నన్ను సాకిప్రోవ నీ
హృదయమునను దోచలేదా తరిగాదా
సొగసుగ శ్రీభద్రగిరియందుఁ నెలకొన్న బిగువా లేకను నగవా
తగవా శ్రీనరసింహ దాసునిఁ బ్రోవఁ
దగవా యోహో రాఘవా, యిట లేవా
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - iMchukaina nabhimaanamu leedaa yidi samayamu gaadaa - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )