| కీర్తనలు | తూము నరసింహదాసు | వనజబాంధవ వంశ - వార్ధిసోముని రఘువరుని జూతము రారె |
| శుద్ధసావేరి - ఆట |
| పల్లవి: |
| వనజబాంధవ వంశ - వార్ధిసోముని రఘువరుని జూతము రారె (దు) ఘనముగ దేవతలు పొగడఁగ - కమలములరుచి మించుపదములు కరుణతో భద్రుని శిరంబున గదియఁ జేసి ధరను వెలసిన |
| చరణము(లు): |
| దశరూపుఁ డిదె నేడు దశరథ తనయుఁడై దశ దిశలను బ్రోవ దశముఖు మర్దించి (దు) విశదముగ త్రిదశులు విరించియు పశుపతియు కుంభజవశిష్ఠులు - కుశికతనయుఁడు లోనుగాగల కోవిదులు గొనియాడ వెలసిన |
| తండ్రి మాటకునై దండకాటవి కేగి - గండు మీరిన రిపుల ఖండించి మౌనుల (దు) నిండు వేడుక లొందఁ జేసియఖండ దీవెనలందుకొని భూమండలంబున దీనజనులను - మెండుగా రక్షింపఁ దలచిన |
| ధీరుఁడై రాజకుమారుఁడై మన్మథా - కారుఁడై త్రిజగదాధారుఁడై వారక (దు) సూరిజన మందారుఁడై దరిఁజేరి శ్రీనరసింహదాసుని కూరిమితో బ్రోవంగ - ధర కోసలాధిపుఁడై చెలంగిన |