| కీర్తనలు | తూము నరసింహదాసు | మనసా నీకీ దురభిమాన మేలనే |
| యదుకులకాంభోజి - ఆది |
| పల్లవి: |
| మనసా నీకీ దురభిమాన మేలనే శ్రీవనమాలి చక్రధర వైకుంఠాచ్యుతా యనుటకు |
| చరణము(లు): |
| పరులను యాచించుమంటె పరుగులు పారెదవుగాని హరినామస్మరణకు నీకాసక్తి పుట్ట దేమందు |
| కారుమాట లాడి ప్రొద్దు గడప జూచెదవుగాని కమలాక్ష శ్రీనారాయణ కౌస్తుభాభరణ యనవు |
| ఆశాపాశములఁ దగిలి గాసి నీల్గెదవుగాని కేశవ ముకుంద హృషీకేశ రమేశ యనవు |
| పొట్టకొఱకునై బహురట్టడి చెందెదవుగాని గట్టిగా రవివంశతిలకు నెట్టయిన సేవింపలేవు |
| భారమింతైనలేక సంసారవాంఛల దిరిగేవు నారసింహదాసవరద నారాయణ యన నేరవు |