కీర్తనలు తూము నరసింహదాసు రామ రామా యన నోరు రాదటే - ఓ మనసా!
యదుకులకాంభోజి (ఆనందభైరవి) - ఆది
పల్లవి:
రామ రామా యన నోరు రాదటే - ఓ మనసా!
వేమరు రుచులెల్ల గోరుచు - వెఱ్ఱివై తిరిగెదవు గాని
చరణము(లు):
ఎక్కడి తలిదండ్రులూ నీ కెక్కడి యన్నదమ్ములు
యొక్కరైన గూడ రారు వట్టిభ్రమ లింతే గాని
సారము లేనట్టి యీ సంసారము దరింపలేక
పూరి సేయనట్టినరులను - చేరి వేడుకొనెదుగాని
నేను నావా రనుమాట - నిజముగా నెరనమ్మి దురభి
మానివై తిరిగేవు ముక్తి - మార్గ మింతైన గానవు
చక్కని వనితల జూచి నిక్కి విఱ్ఱవీగి యెంతో
మక్కువచే జిక్కి వెఱ్ఱి - మమతల దిరిగెదవు గాని
చేరరాని వారిచెంత జేరి కారుమాటలాడి
యూరక ప్రొద్దు గడపెదు - నారసింహదాసు గూడి
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - raama raamaa yana nooru raadaTee - oo manasaa! - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )