కీర్తనలు తూము నరసింహదాసు భామామణులారా మీరు పయనమై రారె
ధన్యాసి - ఆది
పల్లవి:
భామామణులారా మీరు పయనమై రారె
ప్రేమమీరగ భద్రశైల రాములఁ జూతాము
చరణము(లు):
చాలగ గౌతమినది స్నాన మబ్బును
మేలైన ప్రసాదములు మెక్కవచ్చును
సురలు మెచ్చిచూడగా కిన్నరులు మ్రోయగ
గుఱుతుగ రాముడు పెండ్లి కొడుకైనాడుగా
చైత్రశుద్ధనవమి చిత్రతరముగ
భూపుత్రిక వివాహమున సౌమిత్రి గొల్వగ
కన్నుల పండువుగాను గాంచవచ్చునే మంచి
పొన్నలపై నిండ జల్లి పొగడవచ్చునె
కూరిమితోడుత తూము నారసింహుడె
వారక భద్రాద్రి కేగువాఁడైనాడుగ
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - bhaamaamaNulaaraa miiru payanamai raare - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )