| కీర్తనలు | తూము నరసింహదాసు | రారా రఘునందన బిలిచినఁ బల్కవేర భక్తచందనా |
| ముఖారి - ఆది |
| పల్లవి: |
| రారా రఘునందన బిలిచినఁ బల్కవేర భక్తచందనా రారా నను గావవేరా యనిపిల్వ గారడమేల కమలామనోహర |
| చరణము(లు): |
| సాకేతపురవాస నీకేల దయరాదు లోకువగా నెంచి వ్యాకులపెట్టక |
| వందన మిది సనందనార్చిత నీదు మందహాస మోము చందము జూపరా |
| బాగు బాగాయెను బగవాఁడనా నీకు నాగడముగ జూచి జాగేలచేసేవు |
| మోమాటేమియు లేక మోమైనఁజూపక బాముల బెట్టెదవేమొ యోర్వజాల |
| గరిమతోడుత తూము నరసింహదాసుని మరువక బ్రోచె వరభద్రాద్రివాస |