| కీర్తనలు | తూము నరసింహదాసు | నాపాలిభాగ్య మేమందు రఘునాథుడు కనుపించె ముందు |
| ఆనందభైరవి - చాపు |
| పల్లవి: |
| నాపాలిభాగ్య మేమందు రఘునాథుడు కనుపించె ముందు పాపములెల్లను బాపె శ్రీరాముల - రూపము కనులకు రూఢిగ గనుపించె |
| చరణము(లు): |
| బొరసి బొరసి యున్నందుకు తం - బుర చిఱతలు బూనినందుకు తఱుచైన యెండ మధ్యాహ్నవేళయని - వెఱవకబోయి కోవెల దూరినందుకు |
| మంచిసొమ్ముల దాల్చినాడు నవ - మన్మథ రూపమువాడు యెంచగలేరు గౌరీశ వాగీశులు - మంచివారలకెల్ల మంచివాడు వాడు |
| వామాంకమున సీత యున్నది - రఘువరు నెడబాయని చిన్నది సౌమిత్రి శరచాప సహితుడై యా - రామస్వామికి నగ్రభుజంబై యున్నవాడు |
| సకలాఘములు బయలురికెను - రామస్వామి సన్నిధిసేవ దొరకెను అకలంకమైన చేలనలరు రాఘవుసాటి - కొకరైన గలరె యహోయని పిలిచెను |
| మునిజనులకు పెన్నిధానము రామ - మూర్తి భద్రాద్రి నివాసము జనలోకమున నారసింహదాసుడను - పెరిగి దొడ్డపేరు పెట్టుకొన్నందుకు |