కీర్తనలు తూము నరసింహదాసు అరుదైన రత్న సింహాసన మందుఁ గొలువాయె శ్రీరఘురాముఁడు
కాంభోజి - ఆది
పల్లవి:
అరుదైన రత్న సింహాసన మందుఁ గొలువాయె శ్రీరఘురాముఁడు
మెఱుపుతోఁ దగు నీలమేఘ మన సీతా సమేతుడై ఠీవి మీరె నేడు
చరణము(లు):
సరిలేని మౌక్తిక ఛత్రంబు బహ్రతుఁడాసక్తి తోడుతఁ బట్టగ
వెఱవొప్ప లక్ష్మణుండు విల్లునమ్ములు దాల్చి వెనుకదిక్కున నిల్వగా
సరస శత్రుఘ్నుండు కరము లొయ్యనఁ జాచి చామరంబులు వీవఁగా
పరమభక్తుండైన పవమాన సుతుఁడు శ్రీపాదాంబుజము లొత్తఁగ నేడు
సారెసారెకు విభీషణుఁడు నాస్వామి హెచ్చరిక యనుచును దెల్పగా
కోరి సుగ్రీవాది వీరవానర వరులు గొలువు సేయుచునుండగా
జేరి మోదమున వశిష్ఠ గాధేయు లాశీర్వాదములు సేయఁగా
భూరిభేకశంఖ మొఱయు కాహళధ్వనులు భోరుకొల్పుచు మ్రోవగా నేడు
జిగి గుల్కు కమనీయ శీల దివ్యాంగనలు శృంగారములు సేయగా
పొగడొందు మాణిక్యవేదిక ప్రభలు దిక్పుంజము రంజిల్లగా
సొగసైన నుదుటఁ గస్తూరికా తిలకంబు నిగనిగను ప్రభ లీనగా
నగణితంబుగ నయోధ్యా నాయకుడు కోటి హరితేజమునఁ బొంగగా నేడు
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - arudaina ratna siMhaasana maMdu.r goluvaaye shriiraghuraamu.rDu - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )