కీర్తనలు తూము నరసింహదాసు లాలి శ్రీభద్రాచలేశ జయలాలి
(లాలిపాట) నవరోజు - ఆట
పల్లవి:
లాలి శ్రీభద్రాచలేశ జయలాలి
లాలి శ్రీనిజభక్తవాస జయలాలి
చరణము(లు):
రంగైన నవరత్న మంటపంబునను
బంగారుతొట్లలో బాగుమీరగను
శృంగారముగ సీత సేవింపుచుండ
పొంగుచును నిదురబో అంగనలు పాడ
పటుతరంబుగ మెఱయ భాసురకిరీట
వాటముగ కస్తూరి తిలకంబు నుదుట
చాటుమాటును లేక సరసముగ నిచట
నీటుగా నిదురబో నా కన్ను లెదుట
సొగసైన మొలక నవ్వుల ముద్దుగులుక
సోగకన్నుల కలికి చూపులను గులుక
బాగుగను నీచిన్ని పలుకు సుధ లొలుక
వేగమున నిదురబో రఘుకులతిలక
నిద్దంపు చెక్కిళ్ళనీటు మెఱయగను
సద్దుసేయక కొల్వువద్ద లే నిపుడు
ప్రొద్దుచాలగ బోయె ముద్దులరామ
నిదురబోవే యికను నీరదశ్యామ
భద్రగిరి వరదరామదాసునకు
వరము లొసగుటకునై వేంచేసె నేడు
వసియించి వానింట వర సీతతోడ
వనజబాంధవవంశ నిదురబో యికను
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - laali shriibhadraachaleesha jayalaali - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )