కీర్తనలు తూము నరసింహదాసు పోరే మీ యిండ్లకు ప్రొద్దునలేచి
వరాళి - చాపు
పల్లవి:
పోరే మీ యిండ్లకు ప్రొద్దునలేచి
రారే రాముని కొల్వుకు
అనుపల్లవి:
పోరే ప్రొద్దుబోయె బొలతులార రఘు
వీరుని కథలెల్ల విన రేపొత్తురుగాని
చరణము(లు):
పదునాల్గు భువనములు పరిపాలనచేసి
నిదురలేక బడలి నిద్రించి యున్నాడు
సుందరాకారుడు సుప్తి జెందినాడు
సందడి గూడదు యిందువదనలార
నీలవర్ణుడు మల్లెపూల పానుపుమీద
ప్రాలు పాలికచేత బవళించియున్నాడు
భక్తవరులుగూడి పదములు పాడఁగఁ
బంకజ నాభుఁడు పవళించి యున్నాడు
ఆంతర్యమున మోహభ్రాంతిఁచెంది సీతా
కాంతనుగూడి యేకాంతమందున్నాడు
కోరికలర తూమునారసింహుని యింట
జేరి రాముడు శేషశయనుడై యున్నాడు
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - pooree mii yiMDlaku proddunaleechi - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )