| కీర్తనలు | తూము నరసింహదాసు | రామరామ యననైతిని |
| దేశాక్షి - ఆట |
| పల్లవి: |
| రామరామ యననైతిని రామరామ యననైతి రాజసము విడనైతి బ్రేమతో శ్రీభద్రాద్రిధామునిఁ గననైతి |
| చరణము(లు): |
| కానిపోని పనులు నేఁ గడువేడ్క నొనరించి కడకు కాలునిచేతిగాసి నోర్చి పూని దుర్విషయాది పుంజములను జిక్కి మానవాధముడనై మసలితిగాని |
| దినము నెనిమిది జాముల నొక్కగడియయైన మనమున రామునిమహిమ వరించి ఘనుల సంగతి గూడి కాలము గడపక దినములు వ్యర్థముగా తిరిగితిగాని |
| దారితప్పి సంసారమునను జిక్కి కారుమాట లాడి కాలము గడపి భూరి దుర్యశముచేఁ బొక్కుచు సొక్కుచు సారసాక్షునికథ చవి దెలియనైతి |
| తనివిదీరగ భవతాపత్రయము నొంది మనసు చంచలమంది శునకమువలెను దినము పొట్టకొరకు ఘననీచములు లేక ధనవంతులను వెంటఁ దగిలితిగాని |
| వాసిగ భద్రాద్రివాస శ్రీనరసింహ దాసుడనని నీకు దోసిలొగ్గితిని రోసి యిహము లెల్లఁ ద్రోసి మనసు కుదురు చేసి గొల్వగ లేక చెడిపోతిగాని |