కీర్తనలు తూము నరసింహదాసు లేర నాపాలి శ్రీవీరరాఘవ లోకాధార మాధవ శౌరి లేరా
భూపాల - ఆట
పల్లవి:
లేర నాపాలి శ్రీవీరరాఘవ లోకాధార మాధవ శౌరి లేరా
కారుణ్యసాగర కలుషవిదూర ననుఁ గరుణింతువు వేగ లేరా
చరణము(లు):
అత్రి వసిష్ఠాది మునులు మీకృపగోరి పాత్రులై యున్నారు లేరా
పద్మమిత్ర వంశోద్భవ నీరదగాత్ర పవిత్ర చరిత్ర లేరా
వెల్ల టేనుగు వచ్చి వాకిట నున్నది నల్లని నాసామి లేరా
కల్లగాదు జగమెల్ల నేలెడి రఘువల్లభ యిక నిద్ర లేరా
అభ్యంగనము నీకు నమరంగ జేసెడు ననువైన వేళాయె లేరా
సభ్యులందరు గూడి సాక్షాత్కరించిరి సంశయములు మాన్ప లేరా
పరమభక్తులు నిన్నుఁ బ్రార్థింపుచున్నారు పన్నగాధిపతల్ప లేరా
వరభద్రాచలమున శరణాగతత్రాణ బిరుదు బూనిన తండ్రి లేరా
నిరతము సంసారభరము బాపెడి భక్తవరద సీతారామ లేరా, తూము
నరసింహదాసుని వెరవకుమని వెంట దిరుగువేళాయెను లేరా
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - leera naapaali shriiviiraraaghava lookaadhaara maadhava shauri leeraa - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )