కీర్తనలు తూము నరసింహదాసు చూడగల్గెను రాముని సుందరరూపము
అఠాణ - ఆది
పల్లవి:
చూడగల్గెను రాముని సుందరరూపము
వేడుకలర శ్రీభద్రాద్రి విభుని రాఘవప్రభుని నేడు
చరణము(లు):
కఱకు బంగారుమకుటము - మెఱయు కస్తూరితిలకము
సరసమైన బొమలు కరుణ - గుఱియు కన్దోయి గలుగువానిని
ఇందువదనమందు సుందర మందహాసము మెఱయఁగ
నందమైన వెడదయురమునందు ముత్యపు సరులు గలవాని
నీలనీరదదేహము మేలి పసిడిచేలము
చాలభక్తజనులఁ బ్రోవజాలు పదములు గలుగు స్వామిని
రత్న మంటపమందు సీతారమణి వామాంకమందు నెంతో
యత్నముగా మెఱయు మ మ్మేలు యినకులాంబుధిసోముని రాముని
ఇరుగడలఁ జామరము లిడఁగ వరుస ముత్యాల గొడుగు లడర
నరసింహదాసు డెదుటఁ జేయు నాట్య మవధరించు స్వామిని
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - chuuDagalgenu raamuni suMdararuupamu - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )