కీర్తనలు తూము నరసింహదాసు రామ భద్రాద్రిధామా శరణన్న నేటిది మేరా
ఆహిరి - చాపు
పల్లవి:
రామ భద్రాద్రిధామా శరణన్న నేటిది మేరా
అంతట నీవేగతియని నేనాశించితినయా
చరణము(లు):
రంగుగ నీ నవరత్న కిరీటము రమ్యత జూపుమంటి
ముదముతోడి నీ ముంగురులిటు చూపి ముచ్చటాడుమంటి
కరుణతోడ నీ కస్తూరితిలకము కన్నుల జూపుమంటి
సురుచిరమగు నీసోగకన్నుల నన్ను జూచి బ్రోవుమంటి
పొందగు మకరము బోలు కపోలము సుందరతను గంటి
అందమయిన నీ మందహాస మిపు డిందు జూపుమంటి
సంతతంబునను సదయహృదయమున జాల నుంచుమంటి
కంతుజనక నీకాంచనచేలము గానుపించుమంటి
కర మరుదుగ నీకోదండము జూపి కఱవు దీర్పుమంటి
కంకణములు గల కరయుగములు మదిని గోరుచునుంటి
అందెలు గజ్జెలు గల మృదుపదములు నమర జూపుమంటి
మేఘశ్యామల సుందరమగు నీమేను మేల్మి జూపుమంటి
పతితుల నేలెడి బిరుదు గలదని ప్రఖ్యాతిగ వింటి
నరుడను జడుడను జ్ఞానహీనుడను నన్నేలు మటంటి
అత్యాశకుడని అరమరసేయక యరసి ప్రోవుమంటి
జంట బాయకను వెంట నుండి నాయింట నుండుమంటి
నీదాసులవలె నే సేవజేయుటకు నేర్పు నేరనంటి
ధరణి భద్రగిరి వరదరామదాసుని దయ నేలుమంటి
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - raama bhadraadridhaamaa sharaNanna neeTidi meeraa - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )