| కీర్తనలు | తూము నరసింహదాసు | శ్రీమజ్జయవిజయ వైనతేయాంజనేయ నిలయీకృత |
| చూర్ణిక |
| శ్రీమజ్జయవిజయ వైనతేయాంజనేయ నిలయీకృత మహాముఖమంటపాభ్యంతర సమాసీన సమయారవిందభవ కందర్పరిపు సంక్రందన బృందారక సందోహానల వివస్వత్సు కర్బుర వరుణ మరుద్రాజరాజ రాజమౌళి సమ్యగ్వంద్యమానపదరాజీవా। రాజీవ శరశతకోటి జగన్మోహనావతారా। ఇన తారాధిప నిభాస్యోపరి కురువిందముక్తావళి సంవళిత లసదుష్ణిషు భీషణేషు చయవిలుంఠిత బాహుబల సుబాహూ తపనీయ వాతాయు దైతేయ త్రిశిరః ఖరదూషణ మహాకాయాతికాయ దేవాంతక నరాంతక విద్యుజ్జిహ్వాగ్నిపర్ణ విరూపాక్ష ధూమ్రాక్ష మకరాక్ష శక్రజిత్కుంభకర్ణ దశకంఠ ప్రభృతి నిశాచరకంఠా। కంఠసౌందర్య తృణీకృత శంఖా। శంఖకాహళ మురళీవిపంచికా పంచమ స్వరాంచితానూన గానానవద్య పంచమహావాద్య రసప్రమోద హృదయ జలజాతా। జాతరూపమయ ప్రభా భాసమాననేత్రా। నేత్రద్వయ కరుణావలోకనామృతధారావర్ష ప్రహర్షిలోకా। లోకాలోకపర్యంత భూషిత కుందమందార హరిచందన హరిసైంధవ శరదిందు సితారవింద శేషాశీవిషభూష కాశ ప్రతీకాశ కీర్తిభాసా। ???మాభ్యానమాన తారకమంత్రపఠన విబుధనమస్కార మానస। మానసరాజిత రాజమరాళా। మరాళాధ్వ సంభూతి దేశనాభీ మహోత్పలా। ఉత్పలదళ వ్యాకోచాతసీ గుచ్ఛ బలభిదుపల సజలజలదశ్యామ వివర్ణనీయ చిత్రవర్ణశిఖా మానసికాచ్ఛతాళి దళ ఘుటికాఘటిత స్ఫుటవ్యజనామల ధవళాతపత్ర సుందరతర రజత దండవ్రజచామర పుండరీక బంధుమండల సంపూర్ణిమా శశాంక సుదర్శన పాంచజన్యాద్యనేక సార్వభౌమ శుభలాంఛన విరాజమానా। మాననీయ జనతాశయ ధృతకరదీపికా ప్రతిఫలిత వివిధమాణిక్య కనత్కుండల రుక్తాండవ కృద్గండద్వయ దర్పణా మండనాయిత తారకా ఘనసారానర్ఘ్య నవరతన నీరాజనాభరామా। భద్రాచల రఘురామా। లక్ష్మీనృసింహ రామదాస హృత్కమల కర్ణికాధామ। ధామాపహతాయుత తిగ్మధామా నమస్తే నమస్తే నమః॥ |