కీర్తనలు త్యాగరాజు ఆదయ శ్రీరఘువర! నేడేల - రాదయ? ఓ దయాంబుధి!
ఆహిరి - ఆది
పల్లవి:
ఆదయ శ్రీరఘువర! నేడేల - రాదయ? ఓ దయాంబుధి! నీ ॥కా॥
అను పల్లవి:
మోదముతో సద్భక్తిమర్మమును - బోధన జేసి సదా బ్రోచిన నీ ॥కా॥
చరణము(లు):
నిన్ను తిట్టికొట్టి హింసబెట్టిన దన్నియు నన్నన లేదా?
ఎన్నరాని నిందలఁ దాళుమని మన్నించగ లేదా?
అన్నముఁ దాంబూల మొసగి దేహము మిన్నఁ జేయ లేదా?
కన్న తల్లి దండ్రి మేమనుచు త్యాగరాజునికిఁ బరవసమీ లేదా? నీ ॥కా॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - aadaya shriiraghuvara! neeDeela - raadaya? oo dayaaMbudhi! ( telugu andhra )