కీర్తనలు త్యాగరాజు ఉపచారములను చేకొనవయ్య ఉరగరాజ శయన!
భైరవి - ఆది
పల్లవి:
ఉపచారములను చేకొనవయ్య ఉరగరాజ శయన! ॥ఉప॥
అను పల్లవి:
చపల కోటి నిభాంబరధర!
శ్రీ జానకీపతి! దయజేసి నా ॥దుప॥
చరణము(లు):
కపట నాటక సూత్ర ధారివై
కామిత ఫలము లొసఁగెడు రామ
అపరిమిత నవరత్నము ల్బొదిగిన
యపరంజి గొడుగు నీకే తగునయ్య ॥ఉప॥
మెరుగు తీగలరీతిని మెరసెడు
కఱకు బంగారు కాఁడ లమరిన
శరదిందు ద్యుతి సమానమౌ చా
మర యుగములు నీకే తగునయ్య ॥ఉప॥
జాజులు సంపంగులు మరువవు విర
జాజులు కురువేరు వాసనలను వి
రాజ మానమగు వ్యజనము త్యాగ
రాజ వినుత! నీకే తగునయ్య ॥ఉప॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - upachaaramulanu cheekonavayya uragaraaja shayana! ( telugu andhra )