కీర్తనలు త్యాగరాజు ఎటులైన భక్తి వచ్చుటకే యత్నము సేయవే
సామ - చాపు
పల్లవి:
ఎటులైన భక్తి వచ్చుటకే యత్నము సేయవే ॥ఎటులైన॥
అను పల్లవి:
మటుమాయ భవమును మనదని యెంచక
వటపత్ర శయనుని పాదయుగములందు
చరణము(లు):
విద్యా గర్వము లేల? నీ వ
విద్యా వశము గానేల?
ఖద్యోతాన్వయ తిలకుని పురమేలు
బుద్ధి యాశుగ దోచనేల? ఓ మనసా! ॥ఎటులైన॥
రామ నామము సేయ సిగ్గా? కారా
దేమి బల్కవు పుంటి బుగ్గ
భామలు గరదాటక యుండిన జగ్గ
పామర మేను నమ్మక నీటి బుగ్గ ॥ఎటులైన॥
భోగ భాగ్యములందు నిజ
భాగవతులకౌ నీ పొందు
త్యాగరాజ వరదుని నీ యందు
బాగుగ ధ్యానించు భవ రోగమందు ॥ఎటులైన॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - eTulaina bhakti vachchuTakee yatnamu seeyavee ( telugu andhra )