కీర్తనలు త్యాగరాజు ఎన్నాళ్లు తిరిగెడిది యెన్నాళ్లు?
మాళవశ్రీ - ఆది
పల్లవి:
ఎన్నాళ్లు తిరిగెడిది యెన్నాళ్లు? ॥ఎన్నాళ్ళు॥
అను పల్లవి:
ఎన్నరాని దేహము లెత్తి యీ సంసార గహనమందు
పన్నుగ చోరుల రీతి పరులను వేఁగించుచును ॥ఎన్నాళ్ళు॥
చరణము(లు):
రేపటి కూటికి లేదని రేయిఁ బగలు వెసనమొంది
శ్రీపతి పూజల మరచి చేసినట్టి వారివలె నే ॥నెన్నాళ్ళు॥
ఉప్పు కర్పూరము వరకు నుంఛవృత్తిచే నార్జించి
మెప్పులకు పొట్టనింపి మేమే పెద్దల మనుచు ॥నెన్నాళ్ళు॥
భ్రమను కొని యిరుగుఁ బొరుగు భక్షింప రమ్మని పిలువ
అమరుకొని పూజ జపము నా సాయము జేతుననుచు ॥నెన్నాళ్ళు॥
నాయందు యుండు తప్పులు నాఁడె దెలుసుకొంటివిగాని
బాయ విడువకు మహానుభావ! త్యాగరాజ వినుత ॥నెన్నాళ్ళు॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - ennaaLlu tirigeDidi yennaaLlu? ( telugu andhra )