కీర్తనలు త్యాగరాజు ఎవరురా నినువినా గతిమాకు
మోహన - చాపు
పల్లవి:
ఎవరురా నినువినా గతిమాకు ॥ఎ॥
అను పల్లవి:
సవరక్షక నిత్యోత్సవ సీతాపతి ॥ఎ॥
చరణము(లు):
రాదా నాదుపై నీ దయ విన
రాదా మురవైరిగాదా దయఁ బల్క
రాదా యిది మరియాదా నాతో
వాదమా నే భేదమా మాకు ॥ఎ॥
రాక నన్నేచ న్యాయమా ప
రాక నేనంటే హేయమా రామా
రాకాశశిముఖ నీ కాసించితి
సాకుమా పుణ్యశ్లోకమా మాకు ॥ఎ॥
శ్రీశారిగణారాతివి నా
దాశా తెలియకబోతివి ఆప
గేశార్చిత పాలితేశా నవ
కాశమా స్వప్రకాశమా మాకు ॥ఎ॥
రాజా బిగు నీ కేలరా త్యాగ
రాజార్చిత తాళఁ జాలరా
ఈజాలము సేయ రాజా బ్రోవ సం
కోచమా సురభూజమా మాకు ॥ఎ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - evaruraa ninuvinaa gatimaaku ( telugu andhra )