కీర్తనలు త్యాగరాజు ఏమి జేసిన నేమి? శ్రీరామ, స్వామి కరుణ లేని వారిలలో
తోడి - చాపు
పల్లవి:
ఏమి జేసిన నేమి? శ్రీరామ
స్వామి కరుణ లేని వారిలలో ॥నేమి॥
అను పల్లవి:
కామమోహ దాసులై శ్రీరాముని
కట్టు తెలియని వారిలలో ॥నేమి॥
చరణము(లు):
ఇమ్ము కలిగితే నేమి ఇల్లాలికి
సొమ్ము బెట్టితే యేమి
కమ్మవిల్తు కేళిని దెలిసియేమి
తమ్మికంటివాని కరుణలేనివా రిలలో ॥నేమి॥
సవము జేసితే నేమి కలిమికి పుత్రో
త్సవము గలిగితే నేమి
భువిలో నన్యబీజ జనితునిఁ గొనియేమి
శివకర శ్రీరాముని దయలేని వారిలలో ॥నేమి॥
మేడఁగట్టితే నేమి అందున లందరు
జోడు గట్టితే నేమి
చేడియలను మెప్పించఁ గెలిసితే నేమి
ఈడులేని రాముని దయ లేనివా రిలలో ॥నేమి॥
రాజ్యమేలితే నేమి బహుజనులలో
పూజ్యులైతే నేమి
ఆజ్య ప్రవాహముతో నన్న మిడితే నేమి
పూజ్యుఁడైన రాముని దయ లేని వారిలలో ॥నేమి॥
గురువు తానైతేనేమి కంటికి మేను
గురువై తోచితే నేమి
పరమంత్రమన్యుల కుపదేశించితే నేమి
వర త్యాగరాజనుతుని దయ లేనివా రిలలో ॥నేమి॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - eemi jeesina neemi? shriiraama, svaami karuNa leeni vaarilaloo ( telugu andhra )