కీర్తనలు త్యాగరాజు క్షీరసాగరశయన నన్ను
దేవగాంధారి - ఆది
పల్లవి:
క్షీరసాగరశయన నన్ను
చింతలఁ బెట్టవలెనా రామ ॥క్షీ॥
అను పల్లవి:
వారణరాజును బ్రోవను వేగమె
వచ్చినది విన్నానురా రామ ॥క్షీ॥
చరణము(లు):
నారీమణికిఁ జీరలిచ్చినది నాఁడే నే విన్నానురా
ధీరుఁడౌ రామదాసుని బంధము - దీర్చినది విన్నానురా
నీరజాక్షికై నీరధి దాటిన - నీ కీర్తిని విన్నానురా
తారకనామ త్యాగరాజనుత - దయతో నేలుకోరా రామా ॥క్షీ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - xiirasaagarashayana nannu ( telugu andhra )