కీర్తనలు త్యాగరాజు చేతులార శృంగారము జేసి చూతును శ్రీరామ
ఖరహర ప్రియ - ఆది
పల్లవి:
చేతులార శృంగారము జేసి చూతును, శ్రీరామ! ॥చేతులార॥
అను పల్లవి:
సేతుబంధన సురపతి సర
సీరుహ భవాదులు బొగడ, నా ॥చేతులార॥
చరణము(లు):
మెరగు బంగారందెలు బెట్టి
మేటియై సరిగ వల్వలు గట్టి
సురతరు సుమములు సిగనిండఁజుట్టి
సుందరమగు మోమున ముద్దుబెట్టి ॥చేతులార॥
మొలను కుందనపు గజ్జలు గూర్చి
ముద్దుగ నుదుటఁ దిలకముఁ దీర్చి
యలకలపై రావిరేకయుఁ జార్చి
యందమైన నిన్నురమున జేర్చి ॥చేతులార॥
ఆణిముత్యాల కొండె వేసి
హవుసుగా పరిమళ గంధముఁ బూసి
వాణి సురటిచే విసరగ వాసి
వాసియనుచు త్యాగరాజనుతయని రోసి ॥చేతులార॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - cheetulaara shR^iMgaaramu jeesi chuutunu shriiraama ( telugu andhra )