కీర్తనలు త్యాగరాజు జయ మంగళం నిత్య శుభ మంగళం
నాదనామక్రియ - ఆది
పల్లవి:
జయ మంగళం నిత్య శుభ మంగళం ॥జయ॥
అను పల్లవి:
మంగళ మవనిసుతా నాథునికి మంగళ మరవిందాక్షునికి
మంగళ మద్భుత చారిత్రునికి మంగళ మాదిదేవునికి ॥జయ॥
చరణము(లు):
సుందర వదనునికి సుదేహునికి బృందారక గుణవంద్యునికి
మందర ధరునికి మన మాధవునికి శుభఫలదునికి ॥జయ॥
ఇనకులమున వెలసిన రామునికి జనక వచన పరిపాలునికి
మనసిజకోటి లావణ్యునికి కనక సింహాసన నిలయునికి ॥జయ॥
మందానిల భోజశయనునికి మందాకినీ వరజనకునికి
మందజనక శతసంకాశునికి మందార రూపునికి హరికి ॥జయ॥
ఇంద్రాద్యష్ట దిగీశనుతునికి చంద్రాదిత్య సునయనునికి గ
జేంద్రుని సంరక్షించిన రామచంద్రునికి జగద్రూపునికి ॥జయ॥
రాజశేఖర ప్రియునికి మౌని రాజరాజ పూజితునికి త్యాగ
రాజ వినుతునికి వర గజ రాజాది భక్తవరదునికి ॥జయ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - jaya maMgaLaM nitya shubha maMgaLaM ( telugu andhra )