కీర్తనలు త్యాగరాజు జయమంగళం నిత్య శుభమంగళం
నాదనామక్రియ - ఆది
పల్లవి:
జయమంగళం నిత్య శుభమంగళం ॥జ॥
మంగళ మవనిసుతానాథునికి - మంగళ మరవిందాక్షునికి
మంగల మద్భుతచారిత్రునికి - మంగళ మాదిదేవునికి
సుందరవదనునికి సుదేహునికి - బృందారకగణవంద్యునికి
మందరధరునికి మన మాధవునికి శుభఫలదునికి ॥జ॥
ఇనకులమున వెలసిన రామునికి - జనకవచనపరిపాలునికి
మనసిజకోటిలావణ్యునికి - కనకసింహాసన నిలయునికి ॥జ॥
మందానిలభోజశయనునికి - మందాకినీవరజనకునికి
మందజనకశతసంకాశునికి - మందారరూపునికి హరికి ॥జ॥
ఇంద్రాద్యష్ట దిగీశనుతునికి - చంద్రాదిత్యసునయనునికి - గ
జేంద్రుని సంరక్షించిన రామ - చంద్రునికి జగద్రూపునికి ॥జ॥
రాజశేఖర ప్రియునికి మౌని - రాజరాజపూజితునికి త్యాగ
రాజవినుతునికి వరగజ - రాజాది భక్తవరదునికి ॥జ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - jayamaMgaLaM nitya shubhamaMgaLaM ( telugu andhra )