కీర్తనలు త్యాగరాజు తెలిసి రామచింతనతో నామము సేయవే ఓ మనసా
పూర్ణచంద్రిక - ఆది
పల్లవి:
తెలిసి రామచింతనతో నామము సేయవే ఓ మనసా ॥తె॥
అను పల్లవి:
తలఁపు లన్ని నిలిపి నిమిషమైన
తారకరూపుని నిజతత్త్వములను ॥తె॥
చరణము(లు):
రామా యన చపలాక్షులపేరు
కామాదుల పోరువారు వీరు
రామా యన బ్రహ్మమునకుఁ బేరు
ఆ మానవ జననార్తులు దీఱు ॥తె॥
అర్క మనుచు జిల్లేడు తరుపేరు
మర్కట బుద్ధులెట్లు దీఱు
అర్కుడనుచు భాస్కరునికి పేరు కు
తర్కమనే అంధకారము తీఱు ॥తె॥
అజమనుచు మేషమునకుఁ బేరు
నిజకోరిక లేలా గీడేరు
అజుఁడని వాగీశ్వరునికిఁ బేరు
విజయము గల్గును త్యాగరాజ నుతుని ॥తె॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - telisi raamachi.mtanatoo naamamu seeyavee oo manasaa ( telugu andhra )