కీర్తనలు త్యాగరాజు నగుమోము గలవాని నా మనోహరుని
మధ్యమావతి - ఆది
పల్లవి:
నగుమోము గలవాని నా మనోహరుని
జగమేలు శూరుని జానకీవరుని న..
చరణము(లు):
దేవాదిదేవుని దివ్యసుందరుని
శ్రీ వాసుదేవుని సీతారాఘవుని న..
సుజ్ఞాననిధిని సోమసూర్యలోచనుని
అజ్ఞానతమమును అణఁచు భాస్కరుని న..
నిర్మలాకారుని నిఖిలాఘహరుని
ధర్మాదిమోక్షంబు దయచేయు ఘనుని న..
బోధతోఁ బలుమాఱుపూజించి నే నా
రాధింతు శ్రీ త్యాగరాజసన్నుతుని న..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - nagumoomu galavaani naa manooharuni ( telugu andhra )