కీర్తనలు త్యాగరాజు నాదుపైఁ బలికేరు నరులు
మధ్యమావతి - జంప
పల్లవి:
నాదుపైఁ బలికేరు నరులు
వేదసన్నుత భవము వేఱు జేసితి ననుచు ॥నా॥
చరణము(లు):
పంచశరజనక ప్రపంచమునఁ గల సుఖము
మంచువలె ననుచు మది నెంచితిగాని
పంచుకొని ధనము లార్జించుకొని సరియెవ్వ
రంచు మఱి గతియు లేదంచుఁ బల్కితినా ॥నా॥
దినము నిత్యోత్సవమ్మున కాసఁ జెందితినా
మనసునను నిల్లు యొకటని యుంటిగాని
అనుదినము యొరులమేలును జూచి తాళలే
కను రెండు సేయవలె ననుచుఁ బల్కితినా ॥నా॥
ప్రాణమేపాటి యని మానమే మేలంటి
గాని శ్రీరామ పరమానంద జలధి
శ్రీనాథకులములో లేనిదారిని బట్టి
జానెఁడుదరము నింప నొరులఁ బొగడితినా ॥నా॥
ఆజానుబాహుయుగ శ్రీజానకీపతి ప
యోజాక్ష శ్రీత్యాగరాజనుత చరణ
ఈ జగతిలో నిన్నుఁ బూజించువారి న
వ్యాజమునఁ బ్రోచే సురాజ నీవాఁడైన ॥నా॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - naadupai.r balikeeru narulu ( telugu andhra )