కీర్తనలు త్యాగరాజు నీకే దయరాక నే జేయు పనులెల్ల నెరవేరునా
నీలాంబరి - త్రిపుట
పల్లవి:
నీకే దయరాక నే జేయు పనులెల్ల నెరవేరునా? రామ ॥నీకే॥
అను పల్లవి:
ఏకోపించక నేను నీవను జ్ఞాని
కేలాగు సుఖమిచ్చునే? ఓ రాఘవ ॥నీకే॥
చరణము(లు):
మనసు నిల్వని వారు మాయా జాలముఁ జేసి
మఱి ముక్తి గొననౌనే?
కను సౌజ్ఞకు రాని కాంతను బలిమినిఁ
గరమిడ వశమౌనే? ఓ రాఘవ ॥నీకే॥
వాడుక లేని విద్యల చేత సభలోన
వాదించఁ బోనౌనే?
చాడి విన్నమాట మదిని నిల్ప లేని
సరసుని వితమౌనే? ఓ రాఘవ ॥నీకే॥
మెప్పులకై బహు ధర్మముఁ జేసిన
మిగుల బ్రోవ తగునే?
తప్పుమాటలుగాదు తారక నామ శ్రీ
త్యాగరాజునిపైని ఓ రాఘవ ॥నీకే॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - niikee dayaraaka nee jeeyu panulella neraveerunaa ( telugu andhra )